హైదరాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనియన్ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసమే సమ్మె చేస్తున్నారంటూ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అయితే ఇది సరైన మార్గం కాదన్నారు.  

ఆర్టీసీ సంస్థకు రూ.1100కోట్ల నష్టం వస్తున్నా కార్మికులకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో ప్రభుత్వం ఎలాంటి లోటుపాట్లు చేయడం లేదని చెప్పుకొచ్చారు. శనివారం నారాయణఖేడ్‌లో పాలశీతల కేంద్రాన్నిప్రారంభించిన మంత్రి తలసాని తెలంగాణ వచ్చిన సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు 44శాతం ఫిట్‌మెంట్‌, 16శాతం ఐఆర్‌ను ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.  

ఆర్టీసీ సంస్థను కాపాడుకునేందుకు ఆర్టీసీ కార్మికులు, జేఏసీ నేతలు మరింతగా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలే తప్ప ఇలా సమ్మెకు దిగి వారిని ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు.  

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోని ఆర్టీసి సిబ్బందికి భారీగా వేతనాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా సమ్మెపై ఆర్టీసీ యూనియన్ నేతలు పునరాలోచించుకోవాలని మంత్రి తలసాని సూచించారు. 

కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 గంటల విద్యుత్ అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 70ఏళ్లలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా 24 గంటలపాటు విద్యుత్ ను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని చెప్పుకొచ్చారు.  

కాళేశ్వరం నీటితో సింగూరును నింపి నారాయణఖేడ్‌ నియోజవర్గాన్ని సస్యశ్యామలం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. గురుకుల పాఠశాలలుపెట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు.  

ప్రతి పక్షపార్టీలకు అభివృద్ధి చేయడం చేతకాదన్నారు. కానీ చేస్తుంటే ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారంటూ తిట్టిపోశారు. రైతులు తమ పొలంలోని కొంత భాగంలో గడ్డి విత్తనాలు నాటుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. 

మనుషులకే డాక్టర్లు లేని దేశంలో పశువులకు కూడా అంబులెన్స్‌ పెట్టిన ఘనత కేసీఆర్ దేనని చెప్పుకొచ్చారు. అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం సబ్సీడీపై గొర్రెలను అందిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు.