తన వీడియోకు ఆడియోను మార్చేశారంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ అమ్మవారి బోనాల సందర్భంగా మంత్రి తలసాని.. పోతురాజులతో కలిసి సరదాగా డ్యాన్స్ చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే మంత్రి డ్యాన్స్ వీడియోకు.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ‘మందు బాబులం‘ ఆడియోను జత చేసి ఆన్‌లైన్‌లో పెట్టారు.

ఇది సోషల్ మీడియాలో సంచలనం సృష్టించడం.. వివిధ వర్గాల నుంచి అభ్యంతరకర కామెంట్లు రావడం తలసాని దృష్టికి వెళ్లింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ... తన వీడియోను ఎవరో మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

అలాగే ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదని.. ప్రతి ఏటా బోనాలలో తాను డ్యాన్స్ చేస్తానని తలసాని గుర్తు చేశారు. తనకు అసలు మద్యం అలవాటు లేదని.. కానీ తాను మద్యం సేవించి పోతురాజులతో నృత్యం చేసినట్లుగా ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

తన వీడియోను మార్ఫింగ్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశానని.. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని తలసాని వెల్లడించారు.