ప్రతిదాడులకు సిద్దం కావాలి: ఈడీ, ఐటీ సోదాలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్
ఈడీ, ఐటీ దాడులతో ఇబ్బందులు పెట్టాలని కేంద్రం ప్రయత్నిస్తుందని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ అడ్డంగా దొరికిపోయిందన్నారు.
హైదరాబాద్:తెలంగాణపై కక్షతోనే ఈడీ దాడులు చేస్తుందని తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు..బుధవారంనాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. దాడులకు ప్రతిదాడులకు కార్యకర్తలకు సిద్దంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. అంతేకాదు అన్ని రాష్ట్రాలతో పెట్టుకోవడం వేరు, తెలంగాణతో పెట్టుకొంటే ఎలా ఉంటుందో చూపాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం తెలంగాణ గొంతు నొక్కాలని చూస్తుందన్నారు. ఈడీ అనే సంస్థ బీజేపీకి అనుబంధంగా పనిచేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
పెట్టుబడులు , పరిశ్రమలు రాకుండా తెలంగాణ నష్టపోవాలని కేంద్రం భావిస్తుందన్నారు.ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బీజేపీ అడ్డంగా దొరికిపోయిందని ఆయన విమర్శించారు.ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని కేంద్రం, మెడికల్ కాలేజీ పెట్టిన మల్లారెడ్డిపై దాడి చేస్తుందని ఆయన మండిపడ్డారు.
తెలంగాణకు చెందిన పలువురు మంత్రులు, టీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకొని ఐటీ, ఈడీ అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారని ఆ పార్టీ మండిపడింది. ఇటీవలనే మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించిన విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో బీజేపీ దొరికితే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.