సూర్యాపేట: ఆర్టీసి సమ్మెపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి సత్యవతి రాథోడ్. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కేసీఆర్ ఏనాడు చెప్పలేదని స్పష్టం చేశారు. కనీసం మేనిఫెస్టోలో కూడా పొందుపరచలేదని చెప్పుకొచ్చారు. 

హామీకి సాధ్యం కాని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అంటే ఎలా అని నిలదీశారు. ఆర్టీసీని బలోపేతం చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికులు 25 శాతం ఫిట్మెంట్ అడిగితే 44 శాతం ఇచ్చి గౌరవించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు.  

ప్రతి ఏడాది రూ.1400 నుంచి1500 కోట్ల నష్టం తీసుకొచ్చింది ఈరోజు సమ్మె చేస్తున్న నాయకులేనని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. దసరా సెలవులు వచ్చాయని, ప్రయాణికులను, విద్యార్థులను ఇబ్బంది పెట్టవద్దని స్వయంగా సీఎం కేసీఆర్ కోరినా వినకుండా యూనియన్ నాయకులు సమ్మెకు పిలుపునిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ ఏనాడు చెప్పలేదన్నారు. 10వేలకు పైగా ఆర్టీసీ బస్సులు ఉంటే 2100 బస్సులు అద్దె బస్సులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 
ఆర్టీసీ నడుపుతున్న ప్రతి కిలోమీటర్ కి 12.75 పైసల నష్టం వస్తుంటే కిరాయి బస్సులకి కిలోమీటర్ కి 75 పైసల నష్టం వస్తుందని చెప్పుకొచ్చారు. 

లాభం వస్తున్న వాటిని కాదని, నష్టం వచ్చే విధానాన్ని కావాలనడం ఎంత వరకు సబబని నిలదీశారు. సమ్మెకు మద్దతు ప్రకటించిన విపక్షాలపైనా సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతు ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన దాఖలాలు ఉన్నాయా అంటూ నిలదీశారు. 

అధికారంలో ఉన్నపుడు ఒకరకంగా లేనపుడు మరో రకంగా మాట్లాడే ద్వంద్వ నీతిని పాటిస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని మండిపడ్డారు. సమ్మెను సమర్దిస్తున్న వారు ఆర్టీసీ దసరా పండగ సమయంలో ఇబ్బంది పెట్టే విధానాన్ని ఏ విధంగా సమర్దించుకుంటారో చెప్పాలని ప్రశ్నించారు. 

రాబోయే 3 రోజుల్లో 100 శాతం ఆర్టీసీ బస్సులు నడపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ రవాణాశాఖ మంత్రిగా ఉన్నపుడు అప్పుల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో నడిపించిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రజలతో ముడిపడిన ఆర్టీసీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ కార్మికులకు అడిగిన దాని కంటే ఎక్కువ చేశారన్నారు. అయితే కొన్ని యూనియన్ నేతల స్వార్థ ప్రయోజనాల కోసం సమ్మె జరుగుతుందని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయబోమని హామీ ఇచ్చారు మంత్రి సత్యవతి రాథోడ్.

నీడనిచ్చిన సంస్థను నరుక్కుంటున్నారు: సమ్మెపై ఎమ్మెల్యే రవీంద్రకుమార్
ఆర్టీసీని ఎంతో బలోపేతం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని స్పష్టం చేశారు ఎమ్మెల్యే రవీంద్రకుమార్. న్యాయపరంగా ఎలాంటి సమస్యనైనా పరిష్కరించారని గుర్తు చేశారు. 

న్యాయమైన డిమాండ్ ను నెరవేరుస్తారే తప్ప ఏనాడు కాదు చేయను అని చెప్పని మంచి మనిషి అని కొనియాడారు. అలాంటి వ్యక్తి ఆదేశాలను సైతం ఖాతరు చేస్తారా అంటూ తిట్టిపోశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ ఏనాడు హామీ ఇవ్వలేదన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియను చూసి ఇక్కడ డిమాండ్ చేయడం సరికాదన్నారు. నీడనిచ్చే సంస్ఠథను కాపాడుకోవాలని అలా కాకుండా నరుక్కోవడం మంచి పద్దతి కాదని హెచ్చరించారు. సమ్మె అంతా రాజకీయ పార్టీలు, యూనియన్ నేతల పన్నాగంలో ఒక భాగంగా కనిపిస్తోందని విమర్శించారు. 

భారతదేశంలో ఎన్నడూ లేనివిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్న సీఎం కేసీఆర్ ఆర్టీసీని కూడా బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇంతలోనే యూనియన్ నేతలు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని అది చాలా తప్పిదమన్నారు ఎమ్మెల్యే రవీంద్రకుమార్.