ఖమ్మం: తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయింది. ఆ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనను కలిసినవారు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. 

నిన్న చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ అని తేలిందని పువ్వాడ అజయ్ చెప్పారు. తనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో  ఆందోళన చెందిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా  ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనను కలిసిన వారు, నాతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు దయచేసి కోవిడ్ పరీక్ష చేసుకోవాలని ఆయన కోరారు.  

అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ నందు ఆయన హోం ఐసోలాషన్ లో ఉన్నారు. "మీ ప్రేమే నాకు అసలైన వైద్యం. దయచేసి నాకు ఫోన్ చేయడానికీ, నన్ను కలుసుకోవడానికీ ప్రయత్నించకండి. నా హెల్త్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. మళ్ళీ యధావిధిగా మీ మధ్యకు వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటాను" ఆయన చెప్పారు.
 

ఇదిలావుంటే, : తెలంగాణ కరోనా మహమ్మారి కోరల్లోంచి మెల్లిమెల్లిగా బయటపడుతోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో చాలా తక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో(ఆదివారం రాత్రి 8 గంటల నుండి సోమవారం రాత్రి 8 గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 48,005 మందికి టెస్టులు చేయగా కేవలం 491పాజిటివ్ కేసులు మాత్రమే బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా కేసుల సంఖ్య 2,78,599కి చేరగా మొత్తం టెస్టుల సంఖ్య 62,05,688కి చేరింది. 

రాష్ట్రంలో ఇటీవల టెస్టుల సంఖ్య పెరిగినా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది.  ఇక ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 596 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,69,828కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 7,272 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

 గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో  ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1499కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 95.1శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 96.85శాతంగా వుంది.