ఇప్పటికే ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ ఆత్మహత్య వ్యవహారంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తమ స్టైఫండ్ డబ్బులు లాక్కొంటున్నారని.. దళిత అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. 

ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్న ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదం సద్దుమణగకముందే అజయ్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. విద్యార్థులను బెదిరించి వారికొచ్చే స్టైఫండ్ లాక్కుంటున్నారంటూ కవిత అనే దళిత మహిళ మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్‌ కుమార్ కుటుంబానికి చెందిన మమత మెడికల్ కాలేజీ (Mamatha Medical College) అక్రమాలకు పాల్పడుతోందంటూ ఆమె చెబుతున్నారు. 

మమత మెడికల్, డెంటల్ కాలేజీ యాజమాన్యం పీజీ విద్యార్థుల స్టైఫండ్ (PG Student Stipend) నొక్కేస్తోందని కవిత ఆరోపిస్తున్నారు. విద్యార్థుల చేత విత్ డ్రాయల్ ఫామ్‌లపై సంతకాలు తీసుకుని వారి డబ్బులు కాజేస్తున్నారని ఆమె అంటోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే స్కాలర్​షిప్​ డబ్బులు (Scholarship money) తమకు ఇవ్వకపోతే ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారని కవిత చెప్పారు. ఈ వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్‌కు (National SC Commission‌) ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. దళితుల నోటికాడ కూడు లాక్కొంటున్న అజయ్ కుమార్ మంత్రి పదవి ఊడగొడతామని కవిత హెచ్చరించారు.

కాగా... ఖమ్మంలో (khammam) బీజేపీ కార్యకర్త సాయి గణేష్ (sai ganesh) .. పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అయితే తర్వాత హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకోవడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, టీఆర్ఎస్ (trs) నాయకుడు, కార్పొరేటర్ భర్త ప్రసన్న కృష్ణ కారణమని బీజేపీ (bjp) నాయకులు ఆరోపిస్తున్నారు. సాయి గణేష్ మరణ వాంగ్మూలం ఆధారంగా నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పువ్వాడ, ప్రసన్న కృష్ణ, త్రీ టౌన్ సీఐ వేధింపులు తట్టుకోలేకే సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని.. వారిపై చర్యలు తీసుకోవాలని అతని అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మరోవైపు ఈ ఘటనపై బీజేపీ శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను (kcr) లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. మంత్రి పువ్వాడను బర్తరఫ్ చేసి.. ఆయనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్ర నాయకత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి హోం మంత్రి అమిత్ షా.. సాయి గణేష్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. అంతేకాకుండా భదాద్రి జిల్లా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.. సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆయన దుయ్యబట్టారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరపాలని రాజీవ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మరోవైపు రాష్ట్ర బీజేపీ ముఖ్యులు కూడా సాయి గణేష్ కుటుంబాన్ని పరామర్శించి.. మంత్రి పువ్వాడపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇకపోతే.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌పై (puvvada ajay kumar) గురువారం జాతీయ మానవ హక్కుల కమీషన్‌కు (national human rights commission) ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ (congress party) . పోలీసులు అండతో విపక్షాలు కార్యకర్తలను వేధిస్తున్నారని ఏఐసీసీ (aicc) సభ్యుడు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు ముస్తఫా, నరేందర్‌పై అక్రమ కేసులు పెట్టారని.. 16 కేసులు, రౌడీషీట్ పెట్టడంతోనే సాయి గణేష్ ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో తెలిపారు. చనిపోయేముందు సాయిగణేశ్ ఈ విషయం మీడియాతో చెప్పాడని వివరించారు. సమగ్ర విచారణ జరిపి పువ్వాడపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు ఏఐసీసీ సభ్యుడు. అంతేకాదు సాయి గణేష్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ గత శుక్రవారం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.