ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇదే స్పీడుతో వెళ్తా: విపక్షాలపై మంత్రి పువ్వాడ ఫైర్
ఖమ్మం అభివృద్దిని చూసి ఓర్వలేకే విపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. ఖమ్మం అభివృద్దిపై ఛాలెంజ్ చేయాలని ఆయన కోరారు.
ఖమ్మం: Khammam అభివృద్దిని చూసి ఓర్వలేకే వివక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని తెలంగాణ రాస్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు.
ఆదివారం నాడు ఖమ్మం లో నిర్వహించిన May Day ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. తనపై కొందరు ఉద్దేశ్యపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. యువకుడి ఆత్మహత్యతో బీజేపీ శవ రాజకీయాలు చేస్తుందన్నారు. జాతీయ పార్టీలు తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని Congress , BJP లపై పువ్వాడ అజయ్ విమర్శించారు. ఖమ్మం అభివృద్దిని చూసి ఓర్వలేకే విపక్షాలు శవ రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. మీకు దమ్ముంటే ఖమ్మం అభివృద్ది గురించి సవాల్ చేయాలని ఆయన కోరారు.
తన కాళ్లలో కట్టె పెట్టి తనను అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు చేశారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా కూడా తాను ఇదే స్పీడుతో అభివృద్ది చేస్తానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు.
గత నెల 14వ తేదీన బీజేపీ కార్యకర్త Sai Ganesh ఆత్మహత్యాయత్నం చేసుకొన్నాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 16న మరణించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులు భరించలేకే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా మీడియాకు చెప్పారు. ఈ ఘటనను బీజేపీ సీరియస్ గా తీసుకొంది. సాయి గణేష్ కుటుంబ సబ్యులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరామర్శించారు. ఫోన్ చేసి సాయి గణేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కేబినెట్ నుండి భర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఇదే విషయమై ఆందోళనకు దిగింది.
సాయి గణేష్ ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కూడా తెలంగాణ హైకోర్టులో ఆంటోని రెడ్డి అనే ఏబీవీపీ కార్యకర్త పిల్ దాఖలు చేశారు.ఈ విషయమై విచారణ చేసిన కోర్టు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహా ఎనిమిది మందికి నోటీసులు జారీ చేసింది.
మరో వైపు సాయి గణేష్ ఆత్మహత్య ఘటనపై పువ్వాడ అజయ్ కుమార్ గత నెలలో స్పందించారు. చిన్న విషయాన్ని ఆసరాగా చేసుకొని రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రిని తాను ఒక్కడినేనని ఆయన చెప్పారు. అందుకే తనపై కుట్రలు పన్నారని కూడా పువ్వాడ అజయ్ కుమార్ విమర్శలు చేశారు.
ఈ ప్రచారాన్ని విపక్షాలు తప్పుబట్టాయి. సాయి గణేష్ ఆత్మహత్య చేసుకొన్న ఘటనను చిన్న విషయంగా మంత్రి ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నాయి. విపక్షాలు రాజకీయ లబ్ది కోసం సాయి గణేష్ ఆత్మహత్యను ఉపయోగించుకొంటున్నాయని పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు.
ఖమ్మం జిల్లాలో సాయి గణేష్ ఆత్మహత్య తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై కూడా నమోదైన కేసుల విషయం కూడా వెలుగు చూసింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అక్రమంగా కేసులు బనాయించారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఈ విషయమై పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా ప్రయోజనం లేకపోయిందని బాధిత కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.