ఎవరిని వదలం:మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఉత్తమ్ ఆగ్రహం, బీఆర్ఎస్‌కు చుక్కలేనా?

మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై  కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెంచింది.  ఇవాళ నీటిపారుదల శాఖాధికారులతో పాటు ఎల్ అండ్ టీ కంపెనీ డైరెక్టర్ తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు.

Telangana Minister Nalamada Uttam kumar Reddy Serious Warning to officers on sinking of Medigadda barrage  lns

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ (లక్ష్మీబ్యారేజీ) కి చెందిన పిల్లర్లు కుంగిపోవడానికి బాధ్యులను ఎవరిని వదలిపెట్టబోమని  తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి  నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి  తేల్చి చెప్పారు. 

సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  హైద్రాబాద్ లో  నీటి పారుదల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి  ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధులకు కూడ ఆహ్వానం పంపారు.ఈ సమావేశంలో  ఎల్అండ్ టీ కంపెనీ  గ్రూప్ డైరెక్టర్ ఎస్ వీ దేశాయ్  పాల్గొన్నారు. మేడిగడ్డ బ్యారేజీని నాణ్యత లేకుండా ఎలా నిర్మించారని  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.  ఈ విషయంలో  తమ ప్రమేయం
 లేదని తప్పించుకోవాలని చూస్తే ఊరుకోబోమని మంత్రి చెప్పారు. 

ప్రజా ధనాన్ని వృధా చేసి ప్రాజెక్టు కూలిపోవడానికి కారణమైన ఎవరిని కూడ వదలి పెట్టబోమని మంత్రి తేల్చి చెప్పారు.  అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టు ఏజెన్సీలను కూడ పిలిచి మాట్లాడుతామని  మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.  

ఈ ఏడాది అక్టోబర్ 21న  మేడిగడ్డ బ్యారేజీ (లక్ష్మీ బ్యారేజీ) కి చెందిన మూడు  పిల్లర్లు కుంగిపోయాయి.  బీ బ్లాక్ లోని  18, 19, 20, 21 పిల్లర్ల మధ్య  కుంగుబాటు జరిగింది. భారీ శబ్దంతో 21వ నెంబర్ పిల్లర్ కుంగిపోయింది. దరిమిలా  మేడిగడ్డ బ్యారేజీపై తెలంగాణ నుండి మహారాష్ట్ర మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.  1632 మీటర్ల పొడవున్న  లక్ష్మీ బ్యారేజీని ఎల్ అండ్ టీ సంస్థ నిర్మించింది. ఈ బ్యారేజీలో 10 టీఎంసీలు నీటిని నిల్వ చేసుకోవచ్చు.  

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై  నీటి పారుదల శాఖాధికారులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా అనే విషయమై  విచారణ జరపాలని పోలీసులను కోరారు. అయితే ఈ విషయంలో  కుట్ర కోణం ఏమీ లేదని  పోలీసులు నిర్ధారించారు. 

ఈ ఏడాది నవంబర్ 2వ తేదీన  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ,  ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. 

ఈ ఏడాది నవంబర్ 3న  నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  నివేదికను కేంద్రానికి అందించింది.  బ్యారేజీ పునాదుల కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవడం వల్లే  పిల్లరు కుంగిపోయిందని  నివేదిక తెలిపింది. బ్యారేజీ పౌండేషన్ కు ఉపయోగించిన మెటీరియల్ కూడ నాసిరకంగా ఉందని కూడ  తేల్చి చెప్పింది.కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా  మేడిగడ్డ బ్యారేజీని నిర్మించారు. 

ఇదిలా ఉంటే ఈ నెల  16న  శాసనమండలిలో  మేడిగడ్డ అంశంపై  తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై  రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించనున్నట్టుగా ప్రకటించారు.  ఈ ప్రాజెక్టును కేసీఆర్ సర్కార్ నిర్మించింది.  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో  ఇంజనీర్ల సూచనలను కూడ పక్కన పెట్టారని  కేసీఆర్ పై అప్పట్లో విపక్షాలు విమర్శలు చేశాయి.మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన విషయంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.ఈ అంశంలో బాధ్యులను చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.  ఈ అంశంతో సంబంధాలున్నవారికి ఉచ్చు బిగించాలని కాంగ్రెస్ భావిస్తుంది.ఈ విషయంలో ఎవరిని వదిలిపెట్టబోమని  కూడ  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి  చేసిన వ్యాఖ్యలు  ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

 

  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios