Asianet News TeluguAsianet News Telugu

రాష్ట్రంలో ఇక కొలువుల కుంభమేళా: తెలంగాణ యువతకు కేటీఆర్ ఆత్మీయ లేఖ

తెలంగాణలో  రానున్న రోజుల్లో  ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం  నోటిపికేషన్లు రానున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.ఉద్యోగాలను దక్కించుకొనేందుకు యువత  పోటీ పడాలని ఆయన కోరారు.ఈ మేరకు  కేటీఆర్ యువతకు లేఖ రాశారు. 

 Telangana Minister  KTR Writes Letter  To  Youth
Author
First Published Dec 4, 2022, 5:20 PM IST


హైదరాబాద్:  రాష్ట్రంలో  కొలువుల కుంభమేళాను నిర్వహించనున్నట్టుగా  తెలంగాణ  మంత్రి కేటీఆర్  చెప్పారు. ఇచ్చిన హామీలను తమ   ప్రభుత్వం  నిలబెట్టుకుంటుందన్నారు.ఈ విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్  ఆదివారంనాడు  యువతకు  లేఖ రాశారు. కష్టపడి చదువుకుని తమ కలలను సాకారం చేసుకోవాలని  మంత్రి యువతను కోరారు.

వ్యవసాయం, సంక్షేమం, సాగునీటి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కొట్లాడిన యువత ఆశలు, ఆకాంక్షలను నిజం చేయడమే ఏకైక లక్ష్యంగా  తెలంగాణ రాష్ట్ర సమితి సర్కార్ పనిచేస్తుందని కేటీఆర్  గుర్తు చేశారు.  

 దేశంలో నవ శకానికి తెలంగాణ సర్కార్ నాంది పలికిందన్నారు.  ఇప్పటికే సుమారు రెండు లక్షల 25వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన ఏకైక రాష్ట్రంగా దేశ చరిత్రలో సరికొత్తను లిఖించబోతుందని చెప్పడానికి తనకు  సంతోషంగా ఉందని మంత్రి చెప్పారు.ఉద్యమకాలంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీకి మించి ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్ర సమితి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేస్తుందని  కేటీఆర్  తెలిపారు. 

తమ మేనిఫెస్టోలో  ఇచ్చిన హామీ మేరకు 1లక్షా 35వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలను మొదటిసారి అధికారంలోకి రాగానే భర్తీ చేసినట్టుగా  కేటీఆర్  గుర్తు  చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక 90 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత నిబద్ధతతో వేగంగా చేపట్టినట్టుగా  కేటీఆర్  వివరించారు. 

ఇప్పటికే సుమారు 32వేల పైచిలుకు ఉద్యోగాల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో పాటు ఇతర శాఖల నుంచి నోటిఫికేషన్లు ఇచ్చామన్నారు.గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లను అతి త్వరలో విడుదల చేయబోతున్నామని మంత్రి ప్రకటించారు.  ఉద్యోగాల భర్తీలో స్థానికులకే అధిక ప్రాధాన్యం దక్కాలన్న ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిని మరువలేమన్నారు.

రాష్ట్రపతి ఉత్తర్వుల సవరించడంతో ఆఫీస్ సబార్డినేట్ నుండి ఆర్‌డివో వరకు అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో 95 శాతం స్థానికులకే దక్కుతున్నాయన్నారు.సిఎం కేసీఆర్ తెచ్చిన కొత్త జోనల్ వ్యవస్థతో తెలంగాణ ఉద్యమ స్పూర్తి ఫలించిందని కేటీఆర్  చెప్పారు.త్వరలోనే మరో 10 వేల మంది ఉద్యోగాలను కూడా క్రమబద్ధీకరించనున్నామని తెలపడానికి సంతోషిస్తున్నానని కేటీఆర్ తెలిపారు. 

పబ్లిక్ సర్వీస్ కమిషన్ తో మాత్రమే కాకుండా పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ , గురుకుల విద్యా సంస్థలతో ప్రత్యేక బోర్డుల ద్వారా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించిన విషయాన్ని కేటీఆర్  వివరించారు. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత  కెసిఆర్  ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఉద్యోగాన్ని అత్యంత పారదర్శకంగా భర్తీ చేసినట్టుగా  కేటీఆర్  తెలిపారు. ఎలాంటి వివక్షకు తావు ఉండకూడదన్న ఉద్దేశంతో గ్రూపు వన్ ఉద్యోగాలలోనూ ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి పలికినట్టుగా  కేటీఆర్  ఈ ప్రస్తావించారు.  ప్రభుత్వ ఉద్యోగాలే గాక ప్రైవేట్ రంగంలోనూ భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తమ ప్రభుత్వం మెరుగుపరిచిందన్నారు.ఇప్పటిదాకా సుమారు 17 లక్షలమందికి పైగా ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పించిన ఘనత మన రాష్ట్రానిదేనన్నారు. ప్రతి నియోజకవర్గంలో  యువత కోసం కోచింగ్  సెంటర్లను ఏర్పాటు చేసినట్టుగా  కేటీఆర్  తెలిపారు.

 ముఖ్యమంత్రి కేసీఆర్  ఆశయానికి అనుగుణంగా నోటిఫికేషన్ల పరంపర కొనసాగుతూనే ఉంటుందని కేటీఆర్  స్పష్టం చేశారు.  ఉద్యోగాల భర్తీ విషయంలో పనికిమాలిన ప్రచారాలను పట్టించుకోవద్దని మంత్రి సూచించారు.  అవకాశవాద, అసత్య రాజకీయ ఆరోపణలు, విద్వేషాలకు ప్రభావితం కాకుండా లక్ష్యం మీదనే గురి పెట్టాలన్నారు.సానుకూల దృక్పథంతో సాధన చేసి స్వప్నాలను సాకారం చేసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు దేశంలోనే అత్యధిక జీతాలను చెల్లిస్తుందన్నారు. ఆ ఉద్యోగాలను స్వంతం చేసుకోవాలని యువతను కేటీఆర్  కోరారు. ఇప్పటిదాకా ఒక ఎత్తు. ఇప్పుడు ఒకెత్తు. ప్రాణం పెట్టి చదవాలని కేటీఆర్  యువతకు సలహా ఇచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios