బీజేపీ, కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ చురకలు వేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్ష‌న్లు, డ‌బుల్ బెడ్రూం ఇండ్లు, క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయో చెప్పాల‌ని ఆయన నిలదీశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లుపై చ‌ర్చ‌కు మీరు ఏ ఊరికి ర‌మ్మంటే ఆ ఊరికి వ‌స్తాన‌ని కేటీఆర్ సవాల్ చేశారు. 

టీఆర్ఎస్ (trs) ప్ర‌భుత్వంపై విమ‌ర్శలు చేస్తున్న బీజేపీ (bjp) , కాంగ్రెస్ (congress) నాయ‌కుల‌కు మంత్రి కేటీఆర్ (ktr) కౌంటరిచ్చారు. విమ‌ర్శలు చేయ‌డం సుల‌భమని.. ప‌నులు చేయ‌డ‌మే క‌ష్ట‌మ‌ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. శనివారం ఎల్లారెడ్డిపేట్ మండ‌లం వెంక‌టాపూర్ గ్రామంలో నూత‌నంగా నిర్మించిన డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు. రాష్ట్రం అభివృద్ధి ప‌థంలో ముందుకు పోతోంద‌ని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆదాయం పెరిగిందని.. రాజ‌కీయం, ప్ర‌జాజీవితంలో సంతోషం ఎక్క‌డ అనిపిస్తుందంటే.. ఇది పేద‌వాడి ప్ర‌భుత్వ‌మ‌ని సునీత చెప్పిన‌ప్పుడు సంతోష‌మేసిందని కేటీఆర్ అన్నారు. అర్హులైన వారంద‌రికీ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అందుతున్నాయని.. భార‌త‌దేశంలో ఎక్క‌డా లేని విధంగా డ‌బుల్ బెడ్రూం ఇండ్లు క‌ట్టించి ఇస్తున్నామని మంత్రి గుర్తుచేశారు. 

మీరు ప‌రిపాలించే రాష్ట్రంలో ఇలాంటి ఇండ్ల‌ను నిర్మించారా? అని బీజేపీ, కాంగ్రెస్ నేత‌ల‌ను కేటీఆర్ ప్ర‌శ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పెన్ష‌న్లు, డ‌బుల్ బెడ్రూం ఇండ్లు, క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కాలు అమ‌ల‌వుతున్నాయో చెప్పాల‌ని ఆయన నిలదీశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లుపై చ‌ర్చ‌కు మీరు ఏ ఊరికి ర‌మ్మంటే ఆ ఊరికి వ‌స్తాన‌ని కేటీఆర్ సవాల్ చేశారు. విమ‌ర్శ‌లు చేసే ముందు ఏం చేశారో చెప్పాలని... ప్ర‌తి గ్రామంలో ఆశించినంత అభివృద్ధి జ‌రుగుతోందని కేటీఆర్ తెలిపారు. స‌ర్కార్ హాస్పిట‌ల్స్‌లో రోగుల సంఖ్య పెరిగిందని.. వెంక‌టాపూర్ కూడా అభివృద్ధి బాట‌లో ముందుకెళ్తోందని మంత్రి చెప్పారు. సిరిసిల్ల రూపుమార్చిన ఘ‌న‌త సీఎం కేసీఆర్‌కే (kcr) ద‌క్కుతుంది అని కేటీఆర్ ప్రశంసించారు. 

అంతకుముందు ఆదిలాబాద్‌లోని సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)కి చెందిన యూనిట్‌కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నా దాన్ని పునరుద్ధరించడంలో బీజేపీ విఫలమైందని మంత్రి టీ హరీశ్‌రావు (Harish rao) మండిపడ్డారు. ఆదిలాబాద్ జిల్లాకు రెండు రోజుల సుదీర్ఘ పర్యటనలో ఉన్న హరీష్ రావు.. సీసీఐ యూనిట్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ శిబిరానికి సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దండే విట్టల్‌, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు తదితరులు పాల్గొన్నారు.

కేంద్రంలోని బీజేపీ పరిపాలన సమాజంలోని అన్ని వర్గాల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని హరీశ్ రావు అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నందుకు ప్రజలు త్వరలో బీజేపీపై పై తిరుగుబాటు చేస్తారన్నారు. ఉద్యోగాల కల్పనపై పార్టీ నాయకులు ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. ఎవ‌రు ఉద్యోగాలు ఇచ్చారు? ఎవ‌రు నిరుద్యోగుల‌కు ఉపాధి అవ‌కాశాలు అందించ‌లేదో బీజేపీ నేత‌లు స‌మాధానం చెప్పాలంటూ ప్ర‌శ్నించారు. “ఏ రాష్ట్రంలో ఎక్కువ నిరుద్యోగం ఉంది? వివిధ ఖాళీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌లను ప్రకటించిన రాష్ట్రం ఏది? దేశం నిరుద్యోగ సవాళ్లను ఎదుర్కొంటోందా? రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు కల్పించిందో ఆయన ప్రకటించాలి’’ అని డిమాండ్ చేశారు.