హైదరాబాద్: నగరంలోని వరద బాధితులకు రూ. 10 వేలు రాకుండా అడ్డుకొన్నవాళ్లు... రూ. 25 వేలు ఇస్తారా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. 

సోమవారం నాడు ఎల్‌బీనగర్, మహేశ్వరం నియోజకవర్గాల్లో కేటీఆర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.  ఈ ఎన్నికల ప్రచారంలో ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు.నగరంలో వరదలు వచ్చిన నాలుగు రోజుల్లోనే సహాయం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే కనీసం ఇంతవరకు ఎలాంటి స్పందన రాలేదన్నారు. 

వరద సహాయం కింద కేంద్ర ప్రభుత్వం కర్ణాటకకు రూ. 600 కోట్లు, గుజరాత్ కు రూ. 500 కోట్లు ఇచ్చిందన్నారు.  తెలంగాణకు మాత్రం కేంద్రం నుండి చిల్లిగవ్వ కూడా రాలేదన్నారు. వరద బాధితులకు జీహెచ్ఎంసీ ఫలితాల తర్వాత సహాయం అందిస్తామని ఆయన ప్రకటించారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరిగిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  తెలంగాణలో ఒక్కో సమస్యను పరిష్కరించుకొంటూ వస్తున్న విషయాన్ని మంత్రి వివరించారు.

తమ ప్రభుత్వ హయంలో ఏనాడూ శాంతిభద్రతలకు విఘాతం కలగలేదన్నారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించామని చెప్పారు.హైద్రాబాద్ లో మంచినీటి సమస్య పరిష్కరించామన్నారు.విద్యుత్ కోత నుండి మిగులు విద్యుత్ స్థాయికి తెలంగాణను తీసుకొచ్చినట్టుగా మంత్రి గుర్తు చేశారు.