ఈ కరోనా కష్టకాలంలో.. ప్రజలకు సహకారిస్తూ నిలపడిన వారిలో సినీ నటుడు సోనూసూద్ ముందు ఉన్నారు. అప్పటి వరకు సినిమాల్లో విలన్ గా కనపడిన ఆయన.. తాను నిజ జీవితంలో చేసిన సేవలతో అందరిచేత హీరో అనిపించుకున్నాడు. తన వంతు తాను  చేయం చేస్తూనే.. స్పెషల్ గా సోనూసూద్ పేరిట ఫండ్స్ సేకరించి వాటి ద్వారా కూడా కరోనా సమయంలో ఇబ్బందులు పడతున్నవారికి సహాయం చేస్తున్నాడు.

అందుకే అందరూ సోనూసూద్ ని సూపర్ హీరో అంటూ పొగిడేస్తున్నారు. కాగా.. తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం సోనూసూద్ ని సూపర్ హీరో అంటూ... ప్రశంసించగా.. అందుకు ఆ రియల్ హీరో ఇచ్చిన రిప్లై ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ.. నెటిజన్లను విపరీతంగా కట్టిపడేస్తోంది. ఇద్దరూ ఒకరి గొప్పతనాన్ని మరొకరు ప్రశంసించుకోవడం విశేషం.

ఇంతకీ మ్యాటరేంటంటే... తెలంగాణకు చెందిన ఒక కరోనా రోగి ట్విట్టర్లో కేటీఆర్ కు కృతజ్ఞత చెప్పారు. కేవలం పది గంటల్లోనే తాము కోరిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్‌ను అందించినందుకు ధన్యవాదాలు కేటీఆర్ సార్. కరోనా కష్టకాలంలో ఇప్పటి వరకూ మీరెంతోమంది తెలంగాణ ప్రజలకి సాయం చేశారు. మీరందించిన సహాయాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము. అంటూ అతను కేటీఆర్ కు మెసేజ్ పెట్టగా.. కేటీఆర్ దీనిపై స్పందించారు.

 

‘ బ్రదర్.. నేను మీరు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధిని. నావంతు బాధ్యత మాత్రమే చేస్తున్నా.. మీరు చెప్పిన సూపర్ హీరో సోనుసూద్. అతనికి కృతజ్ఞతలు చెప్పండి అంటూ కేటీఆర్.. సోనూసూద్ ని ట్యాగ్ చేస్తూ రిప్లై ఇచ్చారు. దీంతో.. కేటీఆర్ ట్వీట్ కు సోనూ సూద్ స్పందించారు.

‘మీ ప్రేమ పూరిత మాటలకు చాలా ధన్యవాదాలు సార్! కానీ మీరు నిజంగా తెలంగాణ కోసం ఎంతో చేసిన హీరో. మీ నాయకత్వంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందింది. నేను తెలంగాణను నా రెండో ఇంటిగా.. నా వర్క్ స్టేషన్ గా భావిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ ప్రజలు నాపై చాలా ప్రేమను చూపించారు. అంటూ సోనూసూద్.. కేటీఆర్ కు మరో రిప్లై ఇచ్చారు.