Asianet News TeluguAsianet News Telugu

వారంటీ లేని పార్టీ గ్యారంటీ ఇస్తుంది: కాంగ్రెస్ హామీలపై కేటీఆర్ సెటైర్లు

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు.  అధికారంలో ఉన్న సమయంలో  ప్రజల కోసం ఏం చేశారని  కేటీఆర్ ప్రశ్నించారు.

Telangana Minister KTR Satirical Comments on Congress Promises lns
Author
First Published Sep 27, 2023, 5:06 PM IST

సిరిసిల్ల:వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీని ఎలా నమ్ముతామని తెలంగాణ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు.రాజన్న సిరిసిల్ల గంభీరావుపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ బుధవారంనాడు  లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు.  కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీపై  మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు. 

కేసీఆర్ రూ. 2 వేల పెన్షన్ ఇస్తే రూ. 4 వేల పెన్షన్ ఇస్తామని హమీలు ఇస్తున్నారన్నారు.తమ ప్రభుత్వం లక్ష రూపాయాల రైతుల రుణాలు మాఫీ చేస్తే కాంగ్రెస్ నేతలు రూ. 2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామంటున్నారన్నారు. .

కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దోచుకున్న డబ్బులను తెచ్చి  పంచుతారన్నారు. కాంగ్రెస్ , బీజేపీ ఇచ్చే డబ్బులను తీసుకొని  బీఆర్ఎస్ కు ఓటేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. తనకు ఎన్నికల్లో మందు, డబ్బులు ఇచ్చే అలవాటు లేదన్నారు. 

ఇంతకాలం పాటు  అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు  ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు.  సాగు, తాగు నీరు ఇవ్వలేని కాంగ్రెస్  పార్టీ గ్యారెంటీలు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ కు11 దఫాలు ప్రజలు అవకాశాలు ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఢిల్లీ నుండి గల్లీ వరకు  కాంగ్రెసే పాలన సాగిందన్నారు.  వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న సీఎం ఎక్కడైనా ఉన్నారా అని కేటీఆర్ ప్రశ్నించారు.

60 ఏళ్లు కాంగ్రెస్ కు అధికారమిస్తే  ప్రజలకు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో  తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను అమలు చేస్తున్నారా అని కేటీఆర్ అడిగారు. కాంగ్రెస్ చెప్పే మాటలు నమ్మి గోస పడదామా అని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడ  ఎన్నడూ జరగని పథకాలు రైతుల కోసం తెచ్చారన్నారు.రైతుల ఖాతాల్లో రూ. 73 వేల కోట్లు జమ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందా అని ఆయన అడిగారు.

 

గంభీరావుపేటలోని కేజీటూపీజీ క్యాంపస్ లో అత్యుత్తమ విద్య అందుతుందన్నారు. రాష్ట్రంలో  కేసీఆర్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకం అందని ఇల్లే లేదన్నారు.  దివ్యాంగులకు  రూ. 4016 పెన్షన్ ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏ చెరువు చూసినా నిండుకుండలా కన్పిస్తుందని చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios