హైదరాబాద్: కేంద్ర మంత్రి అమిత్ షాకి తెలంగాణ మంత్రి కేటీఆర్ కౌంటరిచ్చారు. విషయం లేకుండా విషం చిమ్ముతున్నారని ఆయన మండిపడ్డారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  సనత్ నగర్ నియోజకవర్గంలో ఆదివారం నాడు మంత్రి కేటీఆర్  ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ ను  మోడీ ప్రభుత్వం రద్దుచేసిందన్నారు.  ఐటీఐఆర్ ను రద్దు చేసి ఐటీహబ్ గా ఎలా మారుస్తారని ఆయన ప్రశ్నించారు.మాది నిజాం సంస్కృతి కాదు.... 1920లో మహాత్మాగాంధీ చేసిన కామెంట్స్ ను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గంగా జమునా తెహజీబ్ అని గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. 

also read:హైద్రాబాద్‌కు నిజాం సంస్కృతి నుండి విముక్తి, 2023లో తెలంగాణలో అధికారం మాదే: అమిత్ షా

విషయం లేదు కాబట్టి విషం చిమ్ముతానంటే నడవదని ఆయన స్పష్టం చేశారు.  పిచ్చోళ్ల చేతిలో హైదద్రాబాద్ ను పెట్టొద్దని ఆయన ప్రజలను కోరారు. హైద్రాబాద్ లో వరదలు వచ్చిన సమయంలో  బాధితులను ఆదుకొనేందుకుగాను తాము రూ. 10 వేలు సహాయం అందించామన్నారు. కానీ ఈ వరద సహాయాన్ని కూడ బీజేపీ నిలిపివేసిందన్నారు.

వరద సహాయం బాధితులకు అందితే కేసీఆర్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తోందని ఈ సహాయం అందకుండా నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. 6 లక్షల 46 వేల కుటుంబాలకు వరద సహాయం అందించామని ఆయన గుర్తు చేశారు.

వరదల సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలం తిరిగామన్నారు. ఆ సమయంలో  కేంద్ర మంత్రులు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. తమకు అధికారం ఇస్తే పేదలకు రూ. 15 లక్షలు అందిస్తామని ఇచ్చిన హామీ ఏమైందన్నారు. రూ. 15 లక్షలు ఎవరికైనా ఇచ్చిందా అని ఆయన ప్రశ్నించారు.

ఆరేళ్లలో హైద్రాబాద్ కు కేంద్రం ఎన్ని నిధులు తెచ్చిందో చెప్పాలని ఆయన కోరారు. సికింద్రాబాద్ కు కిషన్ రెడ్డి రెండేళ్లలో ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ఆయన తెలిపారు. జంగల్ రాజ్ నుండి వచ్చిన యూపీ సీఎం ఇక్కడకు వచ్చి నీతులు చెబుతున్నారని ఆయన సెటైర్లు వేశారు.