Asianet News TeluguAsianet News Telugu

దావోస్‌లో సద్గురుతో కేటీఆర్ భేటీ.. హరిత హారం, సేవ్ సాయిల్ ఉద్యమంపై చర్చ.. సద్గురుకు హైదరాబాద్‌ ఆహ్వానం

తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సద్గురుతో భేటీ అయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల కోసం వెళ్లిన మంత్రి కేటీఆర్, సద్గురుతో సమావేశం అయ్యారు. సేవ్ సాయిల్ ఉద్యమం గురించి సద్గురు చెప్పగా.. హరితహారం, ఇతర సాగు వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణకు రావాలని సద్గురును ఆహ్వానించారు.

telangana minister KTR met Sadhguru they discusses haritha haram scheme and save soil movement
Author
New Delhi, First Published May 24, 2022, 9:08 PM IST

న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనడానికి మంత్రి కేటీఆర్ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు వెళ్లారు. కాగా, సేవ్ సాయిల్ ఉద్యమంతో భూసారంపై అవగాహన తెచ్చే కార్యక్రమంలో సద్గురు జగ్గీ వాసుదేవ్ ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతూ తమతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తానుచేపట్టిన సేవ్ సాయిల్ కార్యక్రమం గురించి సద్గురు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలు, పథకాల గురించి కేటీఆర్ చర్చించారు.

వచ్చే మరికొన్ని దశాబ్దాల్లో ప్రపంచంలోని సాగుకు యోగ్యమైన నేలలు అంతరించిపోయే ప్రమాదం ఉందని, భూ సారం క్షీణించే ముప్పు ఉన్నదని సద్గురు వివరించారు. రానున్న తరాలకు ఆహార సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు. కాబట్టి, ఆ విపత్తు రాకముందే ముందే మేల్కుని భూ సారాన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. కాబట్టి, ప్రభుత్వ అధినేతులు, కార్పొరేట్ సంస్థలు, అందరూ కలిసి వచ్చి ఇటువైపుగా అడుగులు వేయాలని వివరించారు. భవిష్యత్ తరాలు ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోగలిగే పరిస్థితులు ఉండేలా ప్రణాళికలు అమలు చేయాలని తెలిపారు. ఇందుకోసం పర్యావరణ అనుకూల కార్యక్రమాలను అన్ని ప్రభుత్వాలు వేగంగా శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కాగా, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పర్యావరణ అనుకూల కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ సద్గురుకు వివరించారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మానవ ప్రయత్న హరితహారం కార్యక్రమం తాము చేపట్టామని, అందుకు సంబంధించిన వివరాలను కేటీఆర్ వివరించారు. సాగు రంగంలోనే తాము విప్లవాత్మక మార్పులు తెచ్చామని, వ్యవసాయ ఉత్పత్తుల పెంపునకు కృష్టి చేస్తున్నామని తెలిపారు. రైతు వేదికల నిర్మాణం, రైతులను సంఘటితం చేయడం, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు.

దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్రం అటువైపుగా అడుగులు వేయలేకపోయిందని, సాగును లాభసాటిగా మార్చకుంటే వ్యవసాయ సంక్షోభం ఏర్పడే ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా సద్గురు చేపట్టిన పుడమి సంరక్షణ (సేవ్ సాయిల్) కార్యక్రమం అద్భుతమైనదని ప్రశంసించారు. సద్గురును హైదరాబాద్‌కు ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం సాగు రంగంలో తెచ్చిన కార్యక్రమాలు, మార్పులను సద్గురు ప్రశంసించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. సారవంతమైన నేలలను కాపాడుకునే తమ ఉద్యమంలో కలిసి రావాలని కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios