ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. అక్కడ పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.  ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమైన కేటీఆర్.. పార్టీ బలోపేతంపై చర్చించారు. 

ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. అక్కడ పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ ముఖ్యనేతలతో సమావేశమైన కేటీఆర్.. పార్టీ బలోపేతంపై చర్చించారు. ఈ భేటీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఇతర నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో వర్గ విబేధాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోసారి హైదరాబాద్‌కు ఖమ్మం జిల్లా నేతలను పిలిపించి విస్తృతంగా చర్చించనట్టుగా చెప్పినట్టుగా సమాచారం. గెలిచేవారికే పార్టీ టికెట్లు కేటాయించనున్నట్టుగా కేటీఆర్.. పార్టీ నాయకులకు కేటీఆర్ స్పష్టం చేశారు.

పార్టీ నేతల మధ్య విభేదాలు ఉండకూడదని సూచించారు. నియోజకవర్గాల్లో నేతల మధ్య గ్రూప్‌ రాజకీయాలు తగదని హితవు పలికారు. జిల్లాలో పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంపై కేటీఆర్‌ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తుమ్మల, పొంగులేటిలు టీఆర్ఎస్‌లోనే ఉన్నప గత కొంతకాలంగా వారు అంటీముట్టనట్టుగా ఉంటున్నారు. వారికి పార్టీలోని కొందరు నేతలతో పడటం లేదనేది బహిరంగ రహస్యమే. ఈ క్రమంలోనే పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశం కావడంతో.. ఉమ్మడి జిల్లా పరిధి టీఆర్ఎస్‌లో గ్రూప్ రాజకీయాలకు కొంతమేర చెక్ పడే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇక, అంతకుముందు ఖమ్మంలో పలు అభివృద్ది కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో 30 ఏళ్లలో కులపిచ్చి, మతపిచ్చి ఎక్కువైందని అన్నారు. 2014లో తెలంగాణ రాకముందు ఖమ్మం పట్టణం ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. ఖమ్మం కార్పొరేషన్‌లో జరుగుతున్న అభివృద్ది మరో కార్పొరేషన్‌లో జరగడం లేదన్నారు. ఆయన ప్రాంతం అభివృద్ది చెందాలనే తపన ఉన్న నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ అని అన్నారు. 

అదే సమయంలో కేంద్రంలోని బీజేపీపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. దేశంలో కులం, మతం పేరుతో చిచ్చు పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. బీజేపీ మత విద్వేషాలను రెచ్చగోడుతుందని మండిపడ్డారు. మతం చిచ్చుపెట్టి.. ఆ మంటల్లో చాలికాచుకుంటుందని విమర్శించారు. విద్వేషం తప్ప మరేదానిపై బీజేపీకి చిత్తశుద్ది లేదన్నారు. ఇతర మతాలపై విషయం చిమ్మే వ్యక్తులు రాజకీయ నాయకులు ఎలా అవుతారని ప్రశ్నించారు. దేశంలో ఎందుకు ఈ విపరీత ధోరణులు ఎందుకు కనిపిస్తున్నాయో ఆలోచన చేయాలన్నారు. 

రెడ్లకు పగ్గాలు ఇస్తేనే తాము అధికారంలోకి వస్తామని రేవంత్ అంటున్నారని.. అలాంటి కుల పిచ్చి వాళ్లు కావాలా?, అన్ని కులాల వాళ్లు కావాలనే కేసీఆర్ కావాలా? అని అడిగారు. కులం ఒక్కటే ఓట్లేస్తే కుల సంఘానికి నాయకుడు అవుతారని అన్నారు. కాంగ్రెస్‌కు 50 ఏళ్లు ఓట్లు వేస్తే వారు ఏం చేశారని ప్రశ్నించారు. చాలా కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్.. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ఎందుకు తీసుకురాలేకపోయిందని ప్రశ్నించారు. కొత్తగా ఆ పార్టీ చేసేదేమీ ఉండదన్నారు. 35 ఏళ్లలో చైనా ఆర్థిక శక్తిగా ఎదిగిందని.. కానీ భారతదేశంలో ఎందుకు జరగడం లేదో ఆలోచన చేయాలన్నారు.