Asianet News TeluguAsianet News Telugu

యూకే : ఫలించిన కేటీఆర్ కృషి .. హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్న దిగ్గజ ఫార్మా సంస్థ

తెలంగాణ ఫార్మా రంగంలో మ‌రో అంతర్జాతీయ సంస్థ పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఇంగ్లాండ్‌కు చెందిన స‌ర్పేస్ మెజెర్‌మెంట్ సిస్ట‌మ్స్ హైదరాబాద్‌లో ల్యాబోరేటరీ ఏర్పాటుకు సుముఖ‌త వ్య‌క్తం చేసింది. ఈ మేరకు యూకే పర్యటనలో వున్న మంత్రి కేటీఆర్‌తో ఆ సంస్థ ఎండీ భేటీ అయ్యారు. 

telangana minister ktr meeting with the leadership of surface measurement systems in his uk tour
Author
Hyderabad, First Published May 18, 2022, 9:58 PM IST

తెలంగాణకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ పర్యటన (ktr uk tour) తొలిరోజు బిజీబిజీగా సాగింది. తొలిసారిగా యూకేలో పర్యటిస్తున్న మంత్రి .. తెలంగాణలో ఉన్న వ్యాపార వాణిజ్య అవకాశాలను ఇక్కడి సంస్థలకు పరిచయం చేస్తున్నారు. ఇందులో భాగంగా యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ (uk india business council) ఏర్పాటు చేసిన రెండు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొనడంతో పాటు పలు కంపెనీల ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ప్రముఖ కంపెనీల సీనియర్ ప్రతినిధి బృందాలకు తెలంగాణలోని వ్యాపార వాణిజ్య అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు. 

ముఖ్యంగా టీఎస్ ఐపాస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యాంకింగ్ ఫైనాన్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా-లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణకు కోసం తీసుకువచ్చిన పాలసీలు, వాటితో ఇప్పటిదాక తెలంగాణకు వచ్చిన భారీ పెట్టుబడుల వివరాలను కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ తెలియచేశారు. తెలంగాణ రాష్ట్ర వినూత్నమైన పారిశ్రామిక పాలసీలతో పాటు పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతులు, భూమి, నీరు, విద్యుత్ సదుపాయాలతో పాటు నాణ్యమైన మానవ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. భారతదేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా అత్యుత్తమమైన మౌలిక వసతులు, పాలసీలు, ప్రోత్సాహకాలు తెలంగాణలో ఉన్నాయన్న కేటీఆర్, తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలను సాదరంగా స్వాగతిస్తున్నామన్నారు. 

 

telangana minister ktr meeting with the leadership of surface measurement systems in his uk tour

 

ముఖ్యంగా దేశంలోని ఇతర నగరాల్లో లేని అసలు సిసలైన కాస్మోపాలిటన్ కల్చర్ హైదరాబాద్‌లో మాత్రమే ఉందని కేటీఆర్ తెలిపారు. ఇండియాలో జీవించేందుకు అత్యంత అనువైన నగరంగా అనేకసార్లు హైదరాబాద్ అవార్డులను అందుకున్న విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తో పాటు లైఫ్ సైన్సెస్- ఫార్మా, బయో టెక్నాలజీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు ఒక హాబ్ గా మారిందని కేటీఆర్ తెలిపారు. పలు మల్టీనేషనల్ కంపెనీలు అమెరికా ఆవల తమ అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్ లో మాత్రమే ఏర్పాటుచేశాయన్న సంగతిని మంత్రి గుర్తుచేశారు. 

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య అనేక దశాబ్దాలుగా ఉన్న బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాల నేపథ్యంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే కంపెనీలు తెలంగాణను తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. భారతదేశం కోణంలో నుంచి మాత్రమే తెలంగాణను చూడొద్దన్న కేటీఆర్, తమ రాష్ట్రంలోని వినూత్న, విప్లవాత్మక విధానాలు, అవకాశాలను అందిపుచ్చుకోవాలని కోరారు. 

 

telangana minister ktr meeting with the leadership of surface measurement systems in his uk tour

 

మరోవైపు తెలంగాణ ఫార్మా రంగంలో మ‌రో అంతర్జాతీయ సంస్థ పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మైంది. ఇంగ్లాండ్‌కు చెందిన స‌ర్పేస్ మెజెర్ మెంట్ సిస్ట‌మ్స్ పెట్టుబ‌డులు పెట్టేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేసింది. రాష్ట్రంలో పార్టిక‌ల్ క్యారెక్ట‌రైజేష‌న్ లాబొరేట‌రీ ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకుంది. ఈ సందర్భంగా స‌ర్పేస్ మెజెర్ మెంట్ సంస్థ ఎండీ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లో 7 వేల చ‌.మీ. వైశాల్యంలో ల్యాబొరేట‌రీ ఏర్పాటు చేస్తామ‌ని స‌ర్పేస్ మెజ‌ర్ మెంట్ సిస్టమ్స్ వెల్లడించింది. రెండేళ్ల‌లో దీనిని విస్త‌రిస్తామ‌ని .. ఈ ల్యాబ్‌ను జాతీయ‌, అంత‌ర్జాతీయ ఫార్మా కంపెనీల ఔష‌ధ ప్ర‌యోగాలకు వేదిక‌గా చేస్తామ‌ని ఆ సంస్థ ఎండీ .. కేటీఆర్‌కు తెలియజేశారు. 
 
డెలాయిట్, హెచ్ఎస్‌బీసీ, జెసిబి, రోల్స్ రాయిస్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్న ఈ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ వెంట పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ , తెలంగాణ అధికార ప్రతినిధి బృందం ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios