నా సీటు పోయినా బాధపడను: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేటీఆర్ వ్యాఖ్యలు
మహిళా రిజర్వేషన్ బిల్లుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ బిల్లును తమ పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తుందన్నారు.
హైదరాబాద్:మహిళా రిజర్వేషన్ కారణంగా తన సీటు పోయినా కూడ తాను బాధపడనని కేటీఆర్ తెలిపారు.ఎక్కువమంది మహిళా లీడర్లు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత పార్లమెంట్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చిస్తున్న విషయాన్ని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
బుధవారంనాడు హైద్రాబాద్ లో ఇంటర్నేషనల్ టెక్ పార్క్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును స్వాగతిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని గతంలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యూఢిల్లీలో ఆందోళన నిర్వహించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వాలని కూడ ఆమె పలు పార్టీల నేతలను కోరారు.మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ రెండు రోజుల క్రితం ఆమోదం తెలపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హర్షం ప్రకటించిన విషయం తెలిసిందే.
మహిళా రిజర్వేషన్ బిల్లును నిన్న లోక్ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘావాల్ ప్రవేశ పెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఇవాళ చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇవాళ చర్చను ప్రారంభించారు. పలు పార్టీల ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో కొన్ని సవరణలను విపక్షాలు సూచిస్తున్నాయి. ఓబీసీ, ఇతర కులాలకు రిజర్వేషన్లను ప్రతిపాదిస్తున్నాయి. ఈ రకమైన సవరణలపై కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందోననేది ఆసక్తికరంగా మారింది. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని బీజేపీ రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకుంటుందని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. గతంలోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టిన విషయాన్ని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు.