హుజూర్‌నగర్‌: తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని వదినమ్మ అంటూ సంబోధించారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌ ఓడిపోతుందన్న విషయం వదినమ్మ పద్మావతీరెడ్డికి తెలుసునంటూ సెటైర్లు వేశారు. 

టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు కేటీఆర్. కాంగ్రెస్‌ చీఫ్‌ ఉత్తమ్‌, బీజేపీ చీఫ్‌ లక్ష్మణ్‌లు కుమ్మక్కై టీఆర్ఎస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. 

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండి హుజూర్ నగర్ నియోజకవర్గానికి ఏమీ చేయలేదని విమర్శించారు. 20 ఏళ్లు అధికారంలో ఉండి హుజూర్‌నగర్‌ను ఎందుకు అభివృద్ధి చేయలేదో చెప్పాలని నిలదీశారు. 

కమ్యూనిస్టులు ఈ ప్రాంతంలో బలమైనవారని, టీఆర్ఎస్ కి మద్దతు ఇచ్చి సైదిరెడ్డి గెలుపునకు సహకరిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. ఉత్తమ్‌తోపాటు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలు అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 

కాంగ్రెస్ పార్టీకి ఓటేయోద్దని సూచించారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే అభివృద్ధి జరగదన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్‌ నాయకురాలు శంకరమ్మ సైతం రోడ్ షోలో పాల్గొన్నారు. శంకరమ్మను పెద్దమ్మ అంటూ కేటీఆర్ సంభోదించారు.