హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏ పార్టీకైనా మద్దతివ్వొచ్చు... ఎక్కడైనా పోటీ చేయవచ్చని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ మద్దతు వల్లే ఏ మేరకు ఫలితం దక్కనుందో  డిసెంబర్ 4వ తేదీన తేలనుందని కేటీఆర్ చెప్పారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి తమ పార్టీ మద్దతివ్వనున్నట్టుగా  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే. ఓ తెలుగు ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జీహెచ్ఎంసీ ఎన్నికల విషయమై ఆయన పలు విషయాలపై మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 10 ఎన్నికలు జరిగితే పలు ఎన్నికల్లో తాము 50 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించినట్టుగా ఆయన గుర్తు చేశారు. పాలేరు, జహీరాబాద్ లాంటి స్థానాల్లో కాంగ్రెస్ నుండి తాము ఈ స్థానాలను దక్కించుకొన్నామన్నారు.

దుబ్బాక ఓటమికి చాలా కారణాలున్నాయన్నారు. ఈ ఒక్క ఓటమిని పెద్దగా చూపుతున్నారన్నారు. తమ గెలుపును వార్తగా చూడకుండా.. తమ ఓటమినే వార్తగా చూస్తున్నారని ఆయన మీడియాను ప్రశ్నించారు. 

జీహెచ్ఎంసీ అభివృద్ధి చేశాం, మరింత అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నామన్నారు. హైద్రాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిసి చాలా కాలనీలు నీటిలో మునిగాయన్నారు. అయితే సహాయం కోసం కేంద్రానికి లేఖ రాస్తే కనీసం కేంద్రం ఒక్క పైసా కూడ విదల్చలేదన్నారు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి జీహెచ్ఎంసీకి ఎందుకు నిధులు తేలేదని ఆయన ప్రశ్నించారు.కొత్త నాలా చట్టాన్ని జనవరి మాసంలో తెస్తామన్నారు. న్యాయ నిపుణులతో చర్చించి  ఈ చట్టాన్ని తీసుకువస్తామన్నారు. 

కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలహీన పడిందన్నారు. దీనికి తాము కారణం కాదన్నారు.ఈ విషయమై ఆ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు రాష్ట్రాన్ని ప్రభావితం చేసేది కాదన్నారు. నగరంలోని రోడ్లకు త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన చెప్పారు.