ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం కొనసాగుతోంది. రెండు రాష్ట్రాలు తమ వాదనలను విన్పిస్తున్నాయి. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎవరూ అడ్డుకొన్నా ఆపబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు. రెండు రాష్ట్రాలు తమ వాదనలను సమర్ధించుకొంటూ కేఆర్ఎంబీకి, ప్రధానికి లేఖలు రాశారు.
నారాయణపేట జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. చట్టప్రకారం రావాల్సిన నీటి వాటాను సాధించుకొంటామన్నారు. ఎవరూ అడ్డుకొన్నా పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ను పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు చోటు చేసుకొన్నాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది.ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తమకు నష్టమని తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ కేఆర్ఎంబీతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ కు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. శ్రీశైలం సహా ఇతర ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడంపై కేఆర్‌ఎంబీకి ఏపీ ఫిర్యాదు చేసింది.రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం కొనసాగుతోంది. జల జగడాన్ని పరిష్కరించాలని ప్రధాని మోడీకి జగన్ లేఖ రాశారు. మరోవైపు కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయించాలని మరో లేఖను జగన్ ప్రధానికి రాశారు.
