కరోనాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కరోనాకు వ్యాక్సిన్‌ వచ్చే వరకు మొత్తం లాక్‌డౌన్ చేసి ఇళ్లలో ఉండలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొందన్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో కరోనా బారిన పడని దేశం లేదని ఆయన గుర్తుచేశారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ... కోవిడ్ వల్ల ఎంతమంది చనిపోతారో తెలియడం లేదు గానీ.. ఆర్దిక ఇబ్బందులతో ఎన్ని ఉద్యోగాలు పోతాయో తెలియని పరిస్ధితి నెలకొందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read:లైవ్ డ్యాష్ బోర్డుల ఏర్పాటు: హైకోర్టుకు తెలిపిన తెలంగాణ ఏజీ

ఇంకా ఎక్కువ కాలం లాక్‌డౌన్ విధిస్తే.. ప్రజలు ఉపాధి కోల్పోతారని మంత్రి అభిప్రాయపడ్డారు. అందరికీ జీవితం, జీవనోపాధి ముఖ్యమని.. కరోనాతో సహజీవనం చేస్తూనే ఉపాధి, అభివృద్ధి సాధించాలని కేటీఆర్ సూచించారు.

కేవలం ప్రభుత్వం మాత్రమే కరోనాకు ఏదో చేయాలని అనుకునే  కంటే... ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 23 వేల కేసులు వెలుగు చూస్తే.. మరణాలు 300 వరకే నమోదయ్యాయని మంత్రి అన్నారు.

Also Read:తెలంగాణలో 27 వేలు దాటిన కరోనా: కొత్తగా 1,879 కేసులు, ఏడుగురి మృతి

అయినప్పటికీ కొంతమంది విమర్శలు చేస్తున్నారని విపక్షాలకు గట్టి సమాధానం చెప్పారు. విపత్కర సమయంలో రాజకీయాలు చేయడం, ఎంతమాత్రం తగదని హితవు పలికారు.

పరీక్షలు చేయట్లేదు... డేటా దాస్తున్నారని అనవసర విమర్శలు చేస్తున్నారని.. అదే నిజమైతే మరి మరణాల సంఖ్య ఎలా దాయగలమని కేటీఆర్ ప్రశ్నించారు. అక్కడక్కడా లోపాలు ఉన్నమాట వాస్తవేమని అంగీకరించిన మంత్రి.. అవి ఎలా సరిదిద్దాలో సూచనలు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరారు.

ఒకప్పుడు ఫార్మా రంగం అంటే కాలుష్యం అనే అపవాదు వుందని, కానీ తెలంగాణ నుంచి పని చేస్తున్న నాలుగు ఫార్మా కంపెనీలు ప్రస్తుతం దూసుకుపోతున్నాయని మంత్రి కితాబిచ్చారు. ప్రస్తుతం 78 శాతం వైద్య పరికరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు.