హుజూర్ నగర్: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లి పెద్ద పొరపాటు చేశారంటూ చెప్పుకొచ్చారు. హుజూర్ నగర్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జగదీష్ రెడ్డి ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రస్తావించారు. 

దసరా పండుగ, పాఠశాలల సెలవుల సమయంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లి ప్రజల మద్దతు కోల్పోయారని విమర్శించారు. ఆర్టీసీ బలోపేతానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో చారిత్రాత్మక కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. ఆర్టీసీ కార్మికులు అడిగినదానికంటే అదనంగానే ఇచ్చారని చెప్పారు. 

ఇకపోతే హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తరలివచ్చి కేసీఆర్ కు స్వాగతం పలకాలన్నారు. 

దేశం గర్వించేలా పాలన అందిస్తున్న కేసీఆర్ ను ప్రజలు సాదరంగా స్వాగతించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పట్టాలని కోరారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీకొడుతున్నాయంటే ఎంతటి అద్భుత పాలన అందిస్తున్నారో తెలుసుకోవాలని సూచించారు. 

ఇకపోతే హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే దుర్భుద్ధితో కాంగ్రెస్ తో బీజేపీ కుమ్మక్కైందని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటయ్యాయని విమర్శించారు. 

హుజూర్ నగర్ ఉపఎన్నికకు సంబంధించి ప్రతి రోజు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, బీజేపీ చీఫ్ లక్ష్మణ్‌ ల మధ్య మాటలు కొనసాగుతున్నాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఇచ్చే ప్రతీ ఫిర్యాదు కాపీలన్నీ ఉత్తమ్ వద్ద ఉన్నాయంటూ జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.