తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీఆర్ఎస్. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సంజయ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు ఆ పార్టీ నాయకులు.

ప్రజలను రెచ్చగొట్టేలా సంజయ్ మాట్లాడుతున్నారని.. ఇది చాలా అభ్యంతరకరమని, అలాగే సోషల్ మీడియాలో పెడుతున్న పోస్ట్‌లు సైతం తప్పుడు  ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.

అటు మంత్రి జగదీశ్ రెడ్డి సైతం బండి సంజయ్‌పై విరుచుకుపడ్డారు. సీఎంని దేశద్రోహి అనే పద్ధతుల్లో అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్నికల తర్వాత మేం అది చేస్తాం, ఇది చేస్తాం అని అంటున్నారని మంత్రి ధ్వజమెత్తారు.

గుజరాత్‌లో చలాన్లు బీజేపీయే కడుతుందా లేక రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా అని జగదీశ్ రెడ్డి నిలదీశారు. ఉత్తరప్రదేశ్‌లో తప్పుచేసిన వాళ్లకి వేసే జరిమానాలు అక్కడి ప్రభుత్వం కడుతుందా అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ- కాంగ్రెస్‌లు కలిసి పనిచేశారని మంత్రి ఆరోపించారు. చీకటి ఒప్పందాలు చేసుకుని తెలంగాణ ప్రజలకు ద్రోహం చేశారని ఆయన ఎద్దేవా చేశారు.