తెలంగాణలో బీజేపీ రాజకీయం నడవదన్నారు రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. తెలంగాణలో బీజేపీ పాచికలు పనిచేయవని.. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు స్పష్టత వుందని మంత్రి తెలిపారు.

బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడు విమర్శలు, ఆరు అబద్ధాలతో రాజకీయం నడవదన్నారు. తెలంగాణలో బీజేపీ పాచికలు పనిచేయవని.. రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు స్పష్టత వుందని మంత్రి తెలిపారు. బీజేపీ కుట్ర రాజకీయాలు మానుకోవాలని హరీశ్ రావు హితవు పలికారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. నిర్మలా సీతారామన్ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ఆర్ధిక మంత్రి తెలంగాణకు వస్తున్నారంటే ఎంతో ఊహించామని.. తెలంగాణ ప్రజలను నిరాశపరిచే పర్యటన చేశారని పల్లా దుయ్యబట్టారు. నెహ్రూ నుంచి మన్మోహన్ వరకు రేషన్ షాపుల మందు ఏ ప్రధాని ఫోటోను పెట్టలేదని ఆయన గుర్తుచేశారు. 

అంతకుముందు శనివారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడుతూ.. నిధులు పక్కదారి పట్టకుండా డిజిటలైజేషన్ తెచ్చామన్నారు. జిల్లాల పర్యటనలో చాలా విషయాలు తెలుసుకున్నానని ఆర్ధిక మంత్రి వ్యాఖ్యానించారు. 60 శాతం నిధులు కేంద్రం ఇస్తే.. 40 శాతం రాష్ట్రాలు భరించాలని నిర్మలా సీతారామన్ అన్నారు. కేంద్రం వాటా ఉన్నప్పుడు పేరు పెట్టడానికి అభ్యంతరం ఏంటని ఆమె ప్రశ్నించారు. 

ALso REad:ఈడీ, సీబీఐ దాడులు పెరుగుతాయి.. బీజేపీకి అవకాశమిచ్చే పనులొద్దు : ఎమ్మెల్యేలకు కేసీఆర్ వార్నింగ్

కేంద్రం నిధులు వాడుకున్నప్పుడు పేరు ఎందుకు వేయడం లేదని నిర్మలా సీతారామన్ నిలదీశారు. తెలంగాణలో 55 శాతం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోందని ఆమె పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ప్రాజెక్ట్‌కు హైదరాబాద్ ఎంపీ ఫోటో పెడతారా అని నిర్మలమ్మ ప్రశ్నించారు. రాజీనామా సవాళ్లను ప్రజలు గమనిస్తున్నారని.. ఆయుష్మాన్ భారత్‌లో 2021 వరకు తెలంగాణ ఎందుకు చేరలేదని కేంద్ర ఆర్ధిక మంత్రి నిలదీశారు. మంత్రులు అవతలి వారు ఏం మాట్లాడారో జాగ్రత్తగా విని స్పందించాలంటూ హరీశ్‌రావుకు నిర్మలా సీతారామన్ చురకలు వేశారు. ఫైనాన్స్ కమీషన్ ఇచ్చిన ఫార్ములా ప్రకారం రాష్ట్రాలకు నిధులు ఇస్తూనే వున్నామని.. ఈ రాష్ట్రానికి ఎక్కువ, ఆ రాష్ట్రానికి తక్కువ ఇవ్వడం అనేది ఎవరి చేతుల్లోనూ వుండదని ఆమె స్పష్టం చేశారు. సెస్‌ల పేరుతో వసూలు చేసే నిధులు కూడా రాష్ట్రాలకే వెళ్తాయని.. ఏ కారణంతో సెస్ వసూలు చేశారో, వాటి కోసమే ఆ నిధులు ఖర్చు చేయాలని నిర్మలా సీతారామన్ సూచించారు. 

ఇకపోతే... శనివారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు భయపడేది లేదన్న ఆయన.. శివసేన, ఆర్జేడీ, ఆప్‌లను కేంద్ర ప్రభుత్వ సంస్థలు టార్గెట్ చేశాయని ఆరోపించారు. బీజేపీ బెదిరింపులను పట్టించుకోవద్దని కేసీఆర్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇతర రాష్ట్రాల్లో చేసినట్లు ఇక్కడ నడవదని.. బీజేపీ మనల్ని ఏం చేయలేదని సీఎం వ్యాఖ్యానించారు. ఈడీ , సీబీఐని చూసి భయపడాల్సిన అవసరం లేదని కేసీఆర్ భరోసా కల్పించారు. కేంద్రం మనల్ని మరింతగా టార్గెట్ చేస్తుందని... వాళ్లకి అవకాశమిచ్చే ఏ పనుల్ని చేయొద్దని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈడీ, సీబీఐలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందన్న ఆయన.. మహారాష్ట్రలో బీజేపీ పాచికలు పనిచేశాయి కానీ, ఢిల్లీ, బీహార్‌లలో ఫెయిల్ అయ్యాయని కేసీఆర్ గుర్తుచేశారు. మునుగోడులో బీజేపీ అడ్రస్ గల్లంతేనని.. వచ్చే ఎన్నికల్లో 80 సీట్లు టీఆర్ఎస్‌కేనని సీఎం పేర్కొన్నారు.