ఆర్ధిక మంత్రులతో నిర్మలా సీతారామన్ భేటీ: హరీష్ రావు గైర్హాజర్
2023-24 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తుపై కేంద్ర ప్రభుత్వం కసరత్తును ప్రారంభించింది. ఇవాళ నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరుగుతున్న ఆర్ధిక మంత్రుల సమావేశానికి తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావు గైర్హాజరయ్యారు.
హైదరాబాద్: 2023-24 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ కసరత్తును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా శుక్రవారంనాడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఆయా రాష్ట్రాల ఆర్ధిక మంత్రులు, కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసింది.ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు దూరంగా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పట్ల అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశానికి దూరంగా ఉంది. గత ఏడాది జరిగిన సమావేశానికి కూడ తెలంగాణ రాష్ట్రం నుండి ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఇవాళ ప్రగతి భవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. వచ్చే నెలలో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై అమలు చేసిన ఆంక్షల కారణంగా సుమారు 40 వేల కోట్లకు పైగా రాష్ట్రం ఆదాయాన్ని కోల్పోయిందని ఆర్ధిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఆర్ధిక శాఖ తీసుకు వచ్చిన ఆంక్షల కారణంగా ఈ పరిస్థితి నెలకొందని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. ఎఫ్ఆర్‌బీఎం పరిమితిపై కోత విధించడం కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్ల మేరకు నిధులు తగ్గాయి. ఆర్ధికంగా ఎలాంటి ఇబ్బందులు లేని రాష్ట్రాలు 0.5 శాతం నిధుల సేకరణకు ఇబ్బంది లేదు.అయితే ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ. 6వేల కోట్లను నష్టపోయింది.
also read:డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీని ఢీకొట్టేందుకు వ్యూహం ఖరారు చేసిన సీఎం కేసీఆర్
కేంద్రం అనుసరిస్తున్న విధానాల కారణంగానే రాష్ట్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఉద్దేశ్యపూర్వకంగానే తమ రాష్ట్రంపై కేంద్రం ఆంక్షలు విధిస్తుందని టీఆర్ఎస్ ఆరోపణలు చేసింది. ఈ విషయమై ఈ ఏడాది డిసెంబర్ మాసంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టాలని కేసీఆర్ తలపెట్టారు.