కృష్ణానదిలో తెలంగాణ వాటా దక్కించుకోవడం కోసం పోరాటం చేస్తామని మంత్రి హరీష్ రావు చెప్పారు. కేంద్రంతో పాటు ఏపీ ప్రభుత్వ వైఖరి కారణంగానే తెలంగాణకు కృష్ణా నదిలో న్యాయమైన వాటా దక్కడం లేదన్నారు.ఈ విషయమై సుప్రీంలో పోరాటం చేస్తున్నామన్నారు.
సంగారెడ్డి: కృష్ణా నదిలో తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కకపోవడానికి కేంద్రం తాత్సారంతో పాటు ఏపీ మొండివైఖరి కూడ కారణమని తెలంగాణ రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.సంగారెడ్డిలో దివంగత ప్రోఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కృష్ణా నీటిలోనూ వాటా కోసం సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జయశంకర్ స్పూర్తితో గోదావరిలో న్యాయమైన వాటాను దక్కించుకొన్నామన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రోఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని ఆయన గుర్తు చేసుకొన్నారు. విద్యార్ధి దశ నుండే తెలంగాణ కోసం ఆయన పోరాటం చేశారన్నారు.జయశంకర్ కలలుగన్న తెలంగాణ నిర్మాణం చేయడమే ఆయనకు నిజమైన నివాళిగా మంత్రి హరీష్ రావు చెప్పారు. జయశంకర్ పేరును ఓ యూనివర్శిటీకి పెట్టుకొని గౌరవించుకొన్నామన్నారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకొంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తోంది. పాలమూరు రంగారెడ్డి , కల్వకుర్తి లిప్ట్ ఇరిగేషన్ విస్తరణ వంటి ప్రాజెక్టులపై తెలంగాణపై ఏపీ ప్రభుత్వం ఫిర్యాదులు చేసిన విషయం తెలిసిందే.
