న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టకుండా కేసులు వేయిస్తూ  కాంగ్రెస్ పార్టీ  ఇబ్బందులు పెట్టిందని  తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు.  ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా  కాంగ్రెస్ పార్టీ నేతలు కళ్లు తెరవాలని ఆయన  కాంగ్రెస్ పార్టీ నేతలకు హితవు పలికారు.

సోమవారం నాడు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని మంత్రి హరీష్ రావు కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు, ఉమ్మడి ఏపీరాష్ట్రంలో సుమారు 10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టుకు ఎందుకు అనుమతులు తీసుకురాలేదని ఆయన ప్రశ్నించారు. 

నాలుగేళ్ల కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులను తీసుకొచ్చి ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్టు మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టు పనులను సీడబ్ల్యూసీ ఛైర్మెన్ పరిశీలించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

సీడబ్ల్యూసీ ఇంజనీర్లు 4 దఫాలుగా ఈ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి పలు విషయాలను అడిగి తెలుసుకొన్నారని ఆయన గుర్తు చేశారు.  తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ అధికారులు చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఆనాడే కోరినా అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఆనాడు పట్టించుకోలేదని ఆయన చెప్పారు.

తుమ్మిడిహెట్టి  వద్ద కాకుండా కాళేశ్వరం వద్ద ప్రాజెక్టునిర్మాణం తలపెట్టినట్టు ఆయన చెప్పారు. నీటి లభ్యత కూడ గణనీయంగా పెరిగిందని చెప్పారు. అంతేకాదు సుమారు 200 టీఎంసీలకు పైగా నీటిని నిల్వ చేసుకొనేలా ప్లాన్ చేసిన విషయాన్ని హరీష్ రావు చెప్పారు.

మహారాష్ట్రతో పాటు తెలంగాణసర్కార్ చేసుకొన్న ఒప్పందం మేరకు  కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని రకాల అనుమతులు లభించాయని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆయన విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండా అడ్డుపడేందుకు కేసులను వేయించిందని ఆయన చెప్పారు. 

నీటి నిల్వ సామర్థ్యం పెంచుకొనేందుకు వీలుగా రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచుకోవాలని సీడబ్ల్యూసీ తమకు సూచించిందన్నారు. ఈ సూచన మేరకు తాము రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచుకొన్నట్టు ఆయన గుర్తు చేశారు. నితిన్ గడ్కరీతో సమావేశం సందర్భంగా రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టుల విషయమై చర్చించినట్టు మంత్రి హరీష్ రావు తెలిపారు.