Minister Gangula Kamalakar: రాష్ట్రంలోని మసీదులను తవ్విచూద్దామని.. అందులో శవం వస్తే మీదని, శివమ్ వస్తే మాదంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంగుల కమళాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Telangana: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కరీంనగర్ లో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలోని మసీదులను తవ్విచూద్దాం... శవాలు వస్తే అది మీది, శివాలు (శివలింగం) వస్తే అది మాది... అంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు కేసీఆర్ పాలకుడయ్యాక రాష్ట్ర అభివృద్ది పథంలో దూసుకుపొతోందని... ఇలాంటి సమయంలో మతవిద్వేషాలను రెచ్చగొట్టడం తగదని మంత్రి గంగుల హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు కూడా విధ్వంసాన్ని కోరుకోవడం లేదని... అభివృద్దినే కోరుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మతకలహాలు లేవు... లా ఆండ్ ఆర్డర్ బాగుందన్నారు. ఇలాంటి తెలంగాణలో మసీదుల్లో గడ్డపార పెట్టి తవ్వేదేదో కేంద్రం నుండి నిధులు తీసుకువచ్చి అభివృద్ది రూపంలో తవ్వు అంటూ సంజయ్ కు మంత్రి గంగుల కౌంటరిచ్చారు.
మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ లో పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. 9.90 లక్షలతో చేపట్టనున్న కుర్మ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. కరీంనగర్ లో ఎటు చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఎంతో అభివృద్ధితో తెలంగాణ దూసుకుపోతోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారు మెరుగైన పాలన అందిస్తున్నదని తెలిపారు. తెలంగాణ రాకముందు కూడా ఇక్కడి ప్రజలు పన్నులు కట్టారు... అయినా అభివృద్ధికి నోచుకోలేదని పేర్కొన్న మంత్రి.. ఉద్యమకారుడు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పాలకుడై తర్వాత కరీంనగర్ లో అభివృద్ధిని పరుగులెత్తిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లా అభివృద్ధి కోసం వేల కోట్లు విడుదల చేసినట్టు వెల్లడించారు. అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. కరీంనగర్ ను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కేబుల్ బ్రిడ్జి... మానేర్ రివర్ ఫ్రంట్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీరును తప్పుబట్టారు. ఆయన మసీదులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు విధ్వంసాన్ని కోరుకోరు... అభివృద్ధిని కాంక్షిస్తారని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో మతకలహాలు లేకుండా... లా అండ్ ఆర్డర్ అదుపులో ఉందని తెలిపారు. అయితే, బండి సంజయ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విధ్వంసాన్ని సృష్టించేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. మతకలహాలు ఉన్న ప్రాంతం అభివృద్ధికి నోచుకోదు... ఇందుకు గుజరాత్ నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొన్న మంత్రి గంగుల కమలాకర్.. ప్రధాని స్వరాష్ట్రం అయినప్పటికీ అందుకే అక్కడికి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడం లేదని తెలిపారు. బండి సంజయ్ గడ్డపారతో తవ్వడం కాదు... నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలంటూ హితవుపలికారు.
ఎంపీ అయిన బండి సంజయ్ మతకలహాలకు ఆజ్యం పోయడం మానుకుని... తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని గంగుల డిమాండ్ చేశారు. మేము అభివృద్ధి చేసి ఓట్లు అడిగితే... బండి సంజయ్ మతం ప్రాతిపాదికన ఓట్లు అడిగేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. పరమతాలను గౌరవించడం నేర్చుకోవాలంటూ హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసం బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంకో మతం గురించి దుర్మార్గంగా మాట్లాడడం ఏ మతం ఒప్పుకోదని మంత్రి తెలిపారు.
