హైదరాబాద్: గాంధీ వైద్యులను కించపర్చేలా వ్యాఖ్యలు చేయవద్దని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కోరారు. గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

గాంధీ ఆసుపత్రిపై దుష్ప్రచారం చేయడం తగదని ఆయన కోరారు. ప్రభుత్వ వైద్యంపై బురద చల్లే ప్రయత్నం మానుకోవాల్సిందిగా ఆయన విపక్షాలను కోరారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు.

ప్రజారోగ్యం విషయంలో రాజీపడబోమని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. కరోనా పేషేంట్లకు సేవలు చేయాలంటే సాహసం కావాలన్నారు. బాధ్యత లేని వాళ్లు రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.వైద్యులు ప్రాణాలను ఫణంగా పెట్టి వైద్యం చేస్తున్నారని ఆయన కొనియాడారు. 

హైద్రాబాద్ ఇమేజ్ ను దెబ్బతీయడానికే  తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని  చెప్పారు. వైద్యుల మనోభావాలను  ఎవరూ కించపర్చేలా వ్యాఖ్యలు చేయొద్దన్నారు.

సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని మంత్రి ఈటల ప్రజలను కోరారు.  లక్షణాలు లేనివారు కరోనా టెస్టులకు రావొద్దని మంత్రి సూచించారు. కరోనా టెస్టులు చేయడం నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

also read:తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం: రీ వాల్యూయేషన్, రీ కౌంటింగ్‌పై ఎఫెక్ట్

ప్రజారోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లను ఖర్చు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టిమ్స్ లో వెయ్యి బెడ్లకు పూర్తిస్థాయిలో ఆక్సిజన్ సౌకర్యాన్ని కూడ కల్పిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. 

రెండు మూడు రోజుల్లో టిమ్స్ ను ప్రారంభించనున్నట్టుగా మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటికే 50 బెడ్లకు వెంటిలేటర్ సౌకర్యాన్ని కల్పించామన్నారు.

జిల్లా స్థాయిలో ఏరియా ఆసుపత్రుల్లో కూడ ఐసీయూలు ఏర్పాటు చేశామని తెలిపారు.ఆరోగ్య రంగంలో కేరళతో పోటీపడుతున్నట్టుగా మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు.