కట్టుకథలతో ముందస్తు ప్రణాళికబద్ధంగా స్కెచ్ గీసి కొన్ని టీవీలలో తన క్యారెక్టర్‌ను తగ్గించే విధంగా కథనాలు వచ్చాయని ఈటల రాజేందర్  తెలిపారు. అంతిమ విజయం, ధర్మం, న్యాయానిదే వుంటుందని ఆయన స్పష్టం చేశారు.

ఇలాంటి ప్రచారాలు ప్రజలు నమ్మరని రాజేందర్ తెలిపారు. తాను 2016లో ఒక హ్యాచరీ పెట్టాలని భావించానని.. తన కుమారుడు పూణే నుంచి వచ్చిన తర్వాత ఇదే విషయం చెప్పానని ఈటల తెలిపారు.

ఈ హాచరీస్ విస్తరించడం కోసం భూములు తీసుకున్నామని.. ఆ చుట్టుపక్కల అసైన్డ్ భూములు వున్నాయని చెప్పారు. ఈ విస్తరణకు సంబంధించి పరిశ్రమల శాఖకు ప్రతిపాదన పెట్టానని... పెట్టుబడిదారులకు భూములు చౌకగా ఇస్తున్నారని , రాయితీలు ఇస్తున్నారని, తన పౌల్టీ పరిశ్రమకు కూడా భూములు కేటాయించాలని  కోరినట్లు ఈటల వెల్లడించారు.

ఇందుకోసం కెనరా బ్యాంక్ నుంచి వంద కోట్లు రుణాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. పౌల్ట్రీకి ల్యాండ్ ఎక్కువగా కావాలని.. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లానని రాజేందర్ చెప్పారు.

అది వ్యవసాయ భూమి కాదని... రైతులు స్వచ్ఛందంగా సరెండర్ చేస్తే ఇండస్ట్రీయల్ కార్పోరేషణ్ ద్వారా ఇవ్వొచ్చని అధికారులు చెప్పారని ఈటల పేర్కొన్నారు. ఒక్క ఎకరం కూడా నా స్వాధీనంలో లేదని తేల్చి చెప్పారు. 

రైతులే స్వచ్ఛందంగా భూముల్ని ప్రభుత్వానికి సరెండర్ చేశారని మంత్రి తెలిపారు. భూములు కోల్పోయినా పర్వాలేదు కానీ ఆత్మను అమ్ముకోనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలో ఏ ఇంటి తలుపు తట్టినా తన సాయం వుంటుందని వెల్లడించారు.

నా మొత్తం చరిత్ర మీద ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎస్, విజిలెన్స్ విచారణలతో పాటు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ చేయాల్సిందేనని రాజేందర్ కోరారు. నా ఆత్మగౌరవం కంటే పదవి గొప్పది కాదని ఆయన తేల్చిచెప్పారు.

నాపై ఆరోపణలు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని రాజేందర్ సవాల్ విసిరారు. ధర్మం తప్పకుండా పనిచేస్తున్నానని.. తాత్కాలికంగా న్యాయం ఓడిపోవచ్చని కానీ అంతిమ విజయం ధర్మానిదేనన్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపేమో తెలియడం లేదని.. ప్రజల కోసం కొట్లాడతా తప్పించి లొంగిపోనని రాజేందర్ తేల్చి చెప్పారు.

వందకోట్ల రుణాలు తీసుకునేంత పరపతి నాకు వుందని.. చిల్లరమల్లర మాటలకు ఈటల బెదిరిపోడన్నారు. పదిమందికి సాయం చేసే మనస్తత్వం నాదని... నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి న్యాయం చేశానని మంత్రి తెలిపారు. 2004కు ముందే నాకు 100 ఎకరాల భూమి వుందని ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో‌ పేర్కొన్నట్లు ఈటల తెలిపారు.