హైదరాబాద్:కరోనా కేసులు పెరిగినా రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొంటామని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ హమీ ఇచ్చారు.గురువారం నాడు అసెంబ్లీలో పలువురు ఎమ్మెల్యేలు  మంత్రి ఈటల రాజేందర్ ను కలిశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎమ్మెల్యేలు మంత్రి ని ఆరా తీశారు.అసెంబ్లీ లో తన ఛాంబర్ నుండి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రీజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి, డీపీహెచ్ డాక్టర్ శ్రీనివాస్ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు,అసోసియేషన్ లతో ఫోన్ లో  మంత్రి మాట్లాడారు.

గత కొద్దిరోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ఇన్ పేషేంట్ల సంఖ్య కూడా పెరిగిందన్నారు. కానీ తీవ్రత లేదని అధికారులు మంత్రికి వివరించారు. కరోనా సోకిన రోగుల చికిత్సకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి రోజూ పరీక్షల సంఖ్యను కూడా పెంచాలని అధికారులను ఆదేశించినట్టుగా ఆయన చెప్పారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు మంత్రి. ఈ నివేదిక ఆధారంగా భవిష్యత్తు కార్యాచారణను సిద్దం చేయనున్నట్టుగా మంత్రి తెలిపారు.