వరంగల్: తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా మారడానికి బిజెపి వలసలను విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో సాధించిన విజయంతో, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు సాధించడంతో రాజకీయ నాయకులకు బిజెపి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఈ స్థితిలో బిజెపిలో చేరడానికి రాజకీయ నాయకులు ముందుకు వస్తున్నారు.

ఇప్పటి వరకు బిజెపిలోకి ఎక్కువగా కాంగ్రెసు నుంచే వలసలు జరిగాయి. తాజాగా టీఆర్ఎస్ మీద కూడా బిజెపి దెబ్బ పడుతోంది. వరంగల్ జిల్లాలో ఓ ప్రముఖ నాయకుడు బిజెపిలో చేరడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు బిజెపిలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

ప్రదీప్ రావు వరంగల్ తూర్పు శాసనసభ నియోజకవర్గంపై కన్నేసినట్లు చెబుతున్నారు. దాంతో ఆయన బిజెపిలో చేరడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు. ప్రదీప్ రావు పార్టీ మారడం వల్ల తమకు నష్టమేమీ లేదని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. 

తమ పార్టీలో పక్కన పెట్టినవారు పార్టీ మారడం సహజమేనని వారంటున్నారు. ప్రదీప్ రావు పార్టీ మార్పును ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా తేలిగ్గా తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.