ఈ నెల 7 నుండి అసెంబ్లీ సమావేశాల జరగనున్న నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సిబ్బందితో కలిసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో మంత్రి ఎర్రబెల్లి సహా ఆయన సిబ్బందికి కరోనా నెగటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అందుకే  తన సిబ్బందితో కలిసి కరోనా టెస్ట్ చేయించుకున్నాని అన్నారు. ప్రజలు కూడా మాస్కులు ధరిస్తూ, సామాజిక దూరంలో వుంటూ స్వీయ నియంత్రణ పాటించాలని మంత్రి  కోరారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా తన కోరలను విస్తరిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2511 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య లక్షా 38 వేల 395కు చేరుకుంది.

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనాతో 11 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించివారి సంఖ్య 877కు చేరుకుంది. తాజాగా గత 24 గంటల్లో కరోనా నుంచి 2578 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్షా 4 వేల 603కు చేరుకుంది. ఇంకా 32915 యాక్టివ్ కేసులున్నాయి.