కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించారు. త్వరలోనే రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేయనున్నట్టుగా చెప్పారు. అయితే రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందిన తర్వాత.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆరు నెలల లోపు మునుగోడులో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.  

కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించారు. ఉప ఎన్నిక వస్తేనే కేసీఆర్ ఎన్నికల హామీలు నెరవేర్చి.. అభివృద్ది చేస్తారని అన్నారు. త్వరలోనే శాసనసభ స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేయనున్నట్టుగా చెప్పారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఆమోదం పొందిన తర్వాత.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆరు నెలల లోపు మునుగోడులో ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లు మునుగోడుపై దృష్టి సారించాయి. మునుగోడులో ఉప ఎన్నిక వస్తే.. ఎలాగైనా విజయం సాధించాలని మూడు పార్టీలు కూడా వారి వారి ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రం సమయం ఉండటంతో.. మునుగోడు ఉప ఎన్నిక అనేది చాలా కీలకం కానుంది. 

రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన నేపథ్యంలో.. ఆ పార్టీ నుంచి ఆయనే బరిలో నిలవనున్నారు. ఇక్కడ కేసీఆర్ పాలన, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టార్గెట్‌గా కాషాయ పార్టీ వ్యుహాలు రచించే అవకాశం ఉంది. అయితే ఈ ఎన్నిక రాజగోపాల్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైనదనే చెప్పాలి. ఈ ఎన్నిక ఫలితాలు ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. 

ఇక, కాంగ్రెస్ పార్టీ సరైన అభ్యర్థిని బరిలో దింపడానికి అన్వేషణ ప్రారంభించింది. గతంలో లేనివిధంగా వేగంగా పావులు కదుపుతుంది. ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కాంగ్రెస్ ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక‌ కమిటీని ప్రకటించింది. ఉప ఎన్నిక స్ట్రాట‌జీ, ప్ర‌చార క‌మిటీకి మాజీ ఎంపీ మ‌ధు యాష్కీ గౌడ్ నేతృత్వం వ‌హించ‌నున్నారు. ఈ క‌మిటీలో దామోద‌ర్ రెడ్డి, బ‌ల‌రాం నాయ‌క్‌, సీత‌క్క‌, అంజన్ కుమార్ యాద‌వ్‌, అనిల్, సంప‌త్‌లు స‌భ్యులుగా వ్య‌వహ‌రించ‌నున్నారు. అయితే ఇప్పటికైతే కాంగ్రెస్.. కైలాష్ నేత, పాల్వాయి స్రవంతి రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది. 

మునుగోడు ఉప ఎన్నిక జరిగితే.. దుబ్బాక, హుజూరాబాద్‌లో ఓటమికి బీజేపీపై ప్రతీకారం తీర్చుకునేందుకు టీఆర్‌ఎస్‌ ఉప ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే సీఎం కేసీఆర్.. మునుగోడుపై ఫోకస్ పెట్టినట్టుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ తరఫున బరిలో నల్గొండ జిల్లాకు చెందిన నేతల పేర్లను పరిశీలిస్తుంది. 2018 ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ప్రభాకర్ రెడ్డికి మరోసారి అవకాశం ఇస్తుందా? లేదా కొత్తవారిని ఎవరినైనా నిలుపుతుందా అనేది చూడాల్సి ఉంది. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌, ప్రభాకర్‌రెడ్డి, భోంగిర్‌ ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌.. టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. 

2018 తర్వాత జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయంటే.. 
తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పటివరకు నాలుగు ఉప ఎన్నికలు జరిగాయి. హుజూర్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన తర్వాత.. ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరగగా.. కాంగ్రెస్‌ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. 

దుబ్బాకలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి హఠాన్మరణంతో.. అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికలో విజయం సాధించిన బీజేపీ.. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకుంది. ఇక, నాగార్జున సాగర్‌‌లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ నోముల నర్సింహయ్య కొడుకు భరత్‌ను బరిలో దింపిన టీఆర్ఎస్.. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుంది.

ఇక, టీఆర్ఎస్‌ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్‌ ఉప ఎన్నిక వచ్చింది. తెలంగాణ మొత్తం తీవ్రమైన చర్చ జరిగిన ఈ ఉప ఎన్నికలో బీజేపీ నుంచి బరిలో దిగిన ఈటల రాజేందర్ విజయం సాధించారు. టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. 

ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో.. 2018 తర్వాత ఐదో ఉప ఎన్నిక.. !
మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి.. ఒత్తిడితో తాను నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలను తోసిపుచ్చారు. నియోజకవర్గ ప్రజల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా సమర్పించి.. దానిని స్పీకర్ ఆమోదిస్తే.. మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అదే జరిగితే.. ఇది 2018 తర్వాత తెలంగాణలో జరిగే ఐదో ఉప ఎన్నిక కానుంది.