తెలుగు వ్యక్తి విద్యుత్ అవసరం లేకుండా కేవలం కర్రలతోనే ట్రెడ్‌మిల్ తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఈ వీడియోపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. 

హైదరాబాద్: ఫిట్‌నెష్ కాన్షియస్ పెరిగిపోతున్నది. ఎక్కువ మంది ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా యువత ఎక్కువ జిమ్‌లకు వెళ్తున్నారు. ఫిట్‌నెస్‌పై స్పృహ ఉన్నవారందరికీ ట్రెడ్‌మిల్ గురించి తప్పక తెలిసే ఉంటుంది. చాలా మంది ట్రెడ్‌మిల్ కొనుక్కుని ఇంట్లోనే వర్కౌట్స్ చేస్తుంటారు. ఈ ట్రెడ్‌మిల్‌కు విద్యుత్ అవసరం పడుతుంది. కానీ, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ వ్యక్తి దీనికి ప్రత్యామ్నాయ ట్రెడ్‌మిల్‌ను తయారు చేసిన ఔరా అనిపించారు.

పర్యావరణ హిత ట్రెడ్‌మిల్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం కర్రలతోనే ట్రెడ్‌మిల్‌ను ఆయన తయారు చేశారు. దీనికి విద్యుత్ కూడా అవసరం లేదు. అరుణ్ భాగవతుల అనే ట్విట్టర్ యూజర్ ఈ ట్రెడ్‌మిల్‌ను తయారు చేసి డెమో ఇస్తున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ వీడియో పోస్టు రాష్ట్ర పట్టణ అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి వెళ్లింది. 

ఆ వీడియోపై మంత్రి కేటీఆర్ ఆసక్తి కనబరిచారు. వావ్ అని ట్వీట్ చేశారు. అంతేకాదు, టీవర్క్స్(భారత్‌లో అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్) హైదరాబాద్‌ను ఆ వీడియో ట్వీట్‌కు ట్యాగ్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని కలుసుకోవాలని, ఆయన తన పనిలో మరింత ముందుకు వెళ్లడానికి సహకరించాలని కోరారు.

Scroll to load tweet…

45 సెకండ్ల ఆ వీడియోలో తొలి భాగం చెక్క ట్రెడ్‌మిల్ తయారీ గురించి ఉంది. కర్రలను అనుసంధానించడం, చైన్‌ ఏర్పాట్లు వంటివి చూచాయగా మనకు కనిపిస్తాయి. ఇక చివరి భాగంలో తయారు చేసిన వుడెన్ ట్రెడ్‌మిల్‌పై ఆయన నడుస్తూ డెమో ఇస్తూ కనిపిస్తాడు.

ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన నైపుణ్యానికి సలామ్‌లు కొట్టారు. ఆయనకు సహాయం చేయాలని పలువురు కోరారు. కాగా, ఇంకొందరు మాత్రం చెక్క ట్రెడ్‌మిల్ పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. విద్యుత్‌తో నడిచే ట్రెడ్‌మిల్‌తో పోలుస్తూ ఈ వుడెన్ ట్రెడ్‌మిల్ అంత సమర్థంగా పని చేయకపోవచ్చని పేర్కొన్నారు. ఇంకొందరు మాత్రం ఇప్పటికే హైదరాబాద్‌లోని జిమ్‌లలో విద్యుత్ లేకుండా నడిచే ట్రెడ్‌మిల్‌లను వినియోగిస్తున్నట్టు ట్వీట్లు చేశారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. ఆయన నైపుణ్యం అద్భుతమనే చెప్పాలి. ఇది ప్రాథమిక దశలోనే ఉన్నదని భావించినా... మరెన్నో మెరుగులు అద్ది మార్కెట్‌లోని పోటీకి అనుగుణంగా ఈ వుడెన్ ట్రెడ్‌మిల్‌ను అగ్రభాగానికి తీసుకురావచ్చనే వాదనలూ వస్తున్నాయి.