Nizamabad: నిజామాబాద్ లో ఒక ఎల‌క్ట్రిక్ బైక్ బ్యాట‌రీ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు చ‌నిపోగా.. మ‌రో ముగ్గురికి తీవ్ర గాయాల‌య్యాయి. వారిని స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.   

Electric bike explodes: ఈ మ‌ధ్య కాలంలో ఎల‌క్ట్రిక్ బైక్ బ్యాట‌రీలు పేలుతున్న ఘ‌ట‌న‌లు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఇటీవ‌ల‌ తమిళనాడులోని వేలూరులో చార్జింగ్ అవుతున్న ఎలక్ట్రిక్ బైక్ పేలి ఓ వ్యక్తి, అతని కూతురు మృతి చెందిన ఘ‌ట‌న మ‌రువ‌క ముందే తెలంగాణ‌లోనూ అలాంటి ఘ‌ట‌న మ‌రొక‌టి చోటుచేసుకుంది. నిజామాబాద్ లో ఒక ఎల‌క్ట్రిక్ బైక్ బ్యాట‌రీ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు చ‌నిపోగా.. మ‌రో ముగ్గురికి తీవ్రంగా గాయ‌ల‌య్యాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ చార్జింగ్‌ పెట్టి పడుకున్న సమయంలో ఒక్క‌సారిగా దాని బ్యాట‌రీ పేలింది. నిజామాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్ లో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ చార్జింగ్‌ పెట్టి పడుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఈ దుర్ఘ‌టనలో రామకృష్ణ అనే వ్యక్తి మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వాళ్లకు చికిత్స నిమిత్తం ఓ ప‌ట్ట‌ణంలోని ఓ ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై దర్యాప్తు చేస్తున్నామ‌ని తెలిపారు. 

కాగా, ఈ మార్చి 26న త‌మిళ‌నాడులో కూడా ఇదే త‌ర‌హా ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఎలక్ట్రిక్‌ బైకు పేలి తండ్రీకూతుళ్లు దుర్మరణం పాలయ్యారు. వేలూరులోని ఓల్డ్ టౌన్ సమీపంలోని చిన్న అల్లాపురంలో చోటు చేసుకుంది. ఘటనలో బైక్‌ ఓనర్‌ దురైవర్మ(49)తో పాటు ఆయన కూతురు మోహన ప్రీతి(13) దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. అల్లాపురంలోని టోల్‌గేట్ సమీపంలో ఎం.దురైవర్మ(49) చాలా ఏళ్లుగా ఫోటో స్టూడియో నిర్వహిస్తూ.. జీవ‌నం సాగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయ‌న కొత్త ఈ-బైక్‌ను కొనుగోలు చేశారు. రోజువారి లాగానే.. శుక్రవారం రాత్రి ఇంట్లోనే బైక్‌ను ఛార్జింగ్‌ పెట్టారు. అయితే విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఈ-బైక్‌లో మంటలు చెలరేగాయి. ఆ వెంట‌నే దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటల్ని ఆర్పేందుకు వర్మ, ప్రీతి నీళ్లు గుమ్మరించే ప్రయత్నం చేయబోయారు. అయితే పొగకు ఉక్కిరి బిక్కిరి అయ్యి.. అక్కడికక్కడే మృతి చెందారు తండ్రీకూతుళ్లు. 

మంటల్ని చూసిన చుట్టుపక్కల వాళ్లు.. రెస్క్యూ అధికారులకు సమాచారం అందించారు. వాళ్లు వచ్చి చూసే లోపే.. ఆ పొగలో దురై, ప్రీతీలు విగత జీవులుగా పడి ఉన్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం అలుముకుంది. బాధితులపై ఎటువంటి కాలిన గాయాలు కనిపించకపోవడంతో వారు ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అరణి మార్గంలోని అడుక్కంపరైలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. బాగాయం పోలీసులు కేసు నమోదు చేశారు. చార్జింగ్‌ సాకెట్‌ పాతదని, దాని వోల్టేజీ కెపాసిటీ తక్కువని, షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల బైక్‌ పేలి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. బాధితుడు దురైవర్మ తొమ్మిదేళ్ల క్రితం 2013లో తన భార్యను కోల్పోయాడని, అప్పటి నుంచి మెరుగైన చదువు కోసం తన కుమార్తెను తిరువణ్ణామలై సమీపంలోని పోలూరులోని పాఠ‌శాల‌లో చ‌దివిస్తున్నారు. చాలా రోజుల తర్వాత అతడిని చూసేందుకు కూతురు ఇంటికి వచ్చిందని స్థానికులు పేర్కొన్నారు.