తెలంగాణలో కరోనా ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. తెలంగాణ కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి కరోనా ఆంక్షలు లేవని చెప్పారు.
తెలంగాణలో కరోనా ఆంక్షలను ప్రభుత్వం ఎత్తివేసింది. తెలంగాణ కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. జనవరి 28న థర్డ్ వేవ్ ఉధృతి పెరిగిందన్నారు. టీకా తీసుకున్నవారిలో కరోనా ప్రభావం తక్కువగా ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి వెళ్లిందని.. ప్రస్తుతం అది 2 శాతం కంటే తక్కువగా ఉందని చెప్పారు. వారంలోగా రాష్ట్రంలో కేసులు వందకు పడిపోనున్నాయని చెప్పారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు పూర్తి స్థాయిలో పనిచేసుకోవచ్చని తెలిపారు.
తెలంగాణ ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవన్నారు. కోవిడ్ వల్ల రెండేళ్లుగా ఎన్నో ఇబ్బందులు పడ్డామని చెప్పారు. ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను విరమించుకోవచ్చని అన్నారు. అన్ని సంస్థలు వంద శాతం పనిచేసుకోవచ్చని తెలిపారు. విద్యాసంస్థలను పూర్తి స్థాయిలో ప్రారంభించినట్టుగా చెప్పారు. ఆన్‌లైన్ తరగతులతో పిల్లల్లో మానసిన సమస్యలు వస్తాయని అన్నారు. కేసులు తగ్గినా మాస్క్‌లు ధరించాలని కోరారు. ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.
ఫీవర్ సర్వే ద్వారా ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కిట్లు అందజేశారని చెప్పారు. మేడారం జాతరకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశామని వెల్లడించారు. కరోనా రానున్న రోజుల్లో సాధారణ ఫ్లూగా మారనుందని చెప్పారు. మరికొద్ది నెలల పాటు కొత్త వేరియంట్స్ వచ్చే అవకాశం లేదన్నారు. తెలంగాణలో 103 శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చామని పేర్కొన్నారు.
ఇక, తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలో గత 24 గంటల్లో 68,720 కరోనా పరీక్షలు నిర్వహించగా... 1,380 మందికి పాజిటివ్ గా తేలింది. తాజా కేసులతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 7,78,910కి చేరింది. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాదులో 350 కొత్త కేసులు నయోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 105, రంగారెడ్డి జిల్లాలో 69, నల్గొండ జిల్లాలో 59 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 3,877 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కరనాతో ఒకరు మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,101కి పెరిగింది.
