హైదరాబాద్:  తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కె. చంద్రశేఖర రావుపై పోరులో భాగంగా తెలంగాణ బిజెపి నేతలు తెలంగాణ విమోచన దినోత్సవ నిప్పును రాజేస్తున్నారు. సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరడానికి బిజెపి నేతలు శనివారం గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కలిశారు.

రాజ్ భవన్ లో  గవర్నర్ తమిళ సైతో  బీజేపీ నేతలు లక్ష్మణ్, ఎంపీ గరికపాటి, పెద్ది రెడ్డి , జితేందర్ రెడ్డి , చింత సాంబమూర్తి , ఇంద్రసేనారెడ్డి, డీకే అరుణ భేటీ అయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవం ను ప్రభుత్వం అధికారికంగా జరుపాలని గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చినట్లు భేటీ తర్వాత బిజెపి తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ మీడియాతో చెప్పారు. 

గత 20 ఏళ్లుగా బీజేపీ దీనిపై పోరాడుతోందని, అన్ని రాజకీయ పార్టీలు అధికారికంగా జరుపాలని కోరుకుంటుంన్నాయని, కానీ అధికారంలోకి వచ్చాక మర్చిపోతున్నాయని ఆయన అన్నారు. మజ్లీస్ కు మిత్రులైన కాంగ్రెస్, టిఆర్ఎస్ లు అదే పని చేసాయని ఆయన విమర్శించారు. 

అమరుల త్యాగాలను ఏందుకు చిన్న చూపు చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గతంలో సీఎం గా రోశయ్య ఉన్నప్పుడు తెలంగాణ విమోచనం అధికరికంగా జరుపాలని డిమాండ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆయనే సీఎం గా ఉన్నప్పటికి ఎందుకు అధికారికంగా జరుపడం లేదని ప్రశ్నించారు. ఎంతో మంది త్యాగాల ఫలితమైన తెలంగాణలో  కేవలం కల్వకుంట్ల చరిత్ర మాత్రమే ఉండాలా ఆయన అడిగారు. ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేస్తున్నామని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామని ఆయనయ చెప్పారు. 

సెప్టెంబర్ 17న పఠాన్ చెరువు లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఊరూరా జాతీయ జెండా ఎగురేస్తామని, బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. మజ్లీస్ స్నేహం కోసమే కాంగ్రెస్ ,టిఆర్ఎస్ లు విమోచన దినోత్సవం గురించి మాట్లాడడం లేదని విమర్శించారు.