అసెంబ్లీ సిబ్బందికి, విలేకరులకు బత్తాయి పండ్లు: స్వయంగా ప్యాక్ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి
సీఎం పిలుపు మేరకు తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు బత్తాయి పండ్లను పంపిణీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం వ్యాధిని కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. అలాగే ప్రజలు సైతం మంచి పోషకాహారాన్ని, ముఖ్యంగా సీ విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు.
ఈ క్రమంలో సీఎం పిలుపు మేరకు తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసెంబ్లీ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు బత్తాయి పండ్లను పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా నుంచి వీటిని హైదరాబాద్ పంపాలని గుత్తా నిర్ణయించారు.
అయితే కరోనా కారణంగా బత్తాయి పండ్లను ప్యాకింగ్ చేసి హైదరాబాద్‌కు పంపడానికి కూలీలు అందుబాటులో లేకపోవడంతో తానే స్వయంగా శుక్రవారం ప్యాకింగ్ చేశారు. అనంతరం పోలీస్ పర్మిషన్ ఉన్న వాహనంలో హైదరాబాద్‌లోని అసెంబ్లీ కార్యాలయానికి పంపారు.
తన చేతుల మీదుగానే పంపిణీ చేయాలని అనుకున్నప్పటికీ వివిధ కారణాల వల్ల అసెంబ్లీ సెక్రటరీ నర్సింహ చార్యులకు ఆ బాధ్యతలు అప్పగించారు. గుత్తా సుఖేందర్ రెడ్డి ఆదేశాల మేరకు నర్సింహ చార్యులు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ రమేశ్ రెడ్డి చేతుల మీదుగా అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు పంపణీ చేశారు.
అలాగే కరోనా నివారణ కోసం ప్రజలు లాక్‌డౌన్‌కు సంపూర్ణంగా సహకరించాలని ఛైర్మన్ కోరారు. వ్యాధి నిరోధక శక్తి పెరిగేందుకు గాను సీ విటమిన్ ఎక్కువగా ఉండే బత్తాయి, నిమ్మ పండ్లను ఎక్కువగా తీసుకోవాలని గుత్తా సూచించారు.