government job: ఆరు నెల‌ల పాటు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యువ‌త‌కు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉద్యోగాల నోటిఫికేషన్‌పై యువ‌త దృష్టి సారించాలని అన్నారు.  

Telangana: రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌) ప్రభుత్వం మెరుగైన పాల‌న అందిస్తున్న‌ద‌ని ఐటీ శాఖ మంత్రి కేటీ.రామారావు (కేటీఆర్‌) అన్నారు. ఆరు నెల‌ల పాటు సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని ఆయ‌న యువ‌త‌కు సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్‌పై యువ‌త దృష్టి సారించాలని అన్నారు. మ‌హ‌బుబ్ న‌గ‌ర్ ప‌ట్ట‌ణంలో వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్‌ల కోసం సిద్ధమవుతున్న ఔత్సాహిక యువతకు నాణ్యమైన కోచింగ్‌ను అందించేందుకు శాంతానారాయణగౌడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్‌లో కేటీఆర్ మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. దాదాపు 90 వేల ప్రభుత్వ ఉద్యోగాలను నిర్ణీత కాలంలో భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణ‌యం తీసుకున్నార‌నీ, కష్టపడి చదివి ఉద్యోగంలో చేరేందుకు యువతకు ఇదే అత్యుత్తమ అవకాశం అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌గా అన్నారు. 

”రాబోయే ఆరు నెలల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని మరియు ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్‌పై దృష్టి పెట్టాలని నేను యువతను అభ్యర్థిస్తున్నాను. ఉద్యోగం వస్తే నీ జీవితమే మారిపోతుంది’’ అని కేటీఆర్ అన్నారు. అనంతరం ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేసిన కేటీఆర్‌ వారికి శుభాకాంక్షలు తెలిపారు. మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రి కేటీఆర్ కు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వినతిపై స్పందించిన మంత్రి ఈ విషయాన్ని తమ శాఖ పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నిధుల కేటాయింపు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. మహబూబ్‌నగర్ పట్టణంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని, రానున్న రోజుల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పట్టణ రూపురేఖలు సమూలంగా మారుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

అంతకుముందు పట్టణంలోని బస్ స్టేషన్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను కేటీఆర్‌ ఎగురవేశారు. ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంటేశ్వరరెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

అంత‌కు ముందు అభివృద్ధికారక జాతీయవాదమే యువత అజెండాగా ఉండాలని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన తొలి ప్రపంచ దేశాల్లో భారత్‌ తన స్థానాన్ని సంపాదించుకోవాలని యువతకు సూచనలు చేశారు. ఇది నిజం కావాలంటే.. భారత యువత ప్రపంచంలో ఉత్తమమైనవాటితో పోటీ పడాలని, సంకుచిత మత, కుల విభజనలను పక్కపెట్టాలని తెలిపారు. అలాగైతేనే.. భారత్ అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలుస్తుందని వివరించారు. ఇది ఇప్పుడే జరగాల్సిన మార్పు అని పేర్కొన్నారు. మిగతా దేశాలతో పోలిస్తే భారత్ అభివృద్ధి బాటలో వెనుకంజ పట్టడానికి గల కారణాలను మంత్రి కేటీఆర్ వివరిస్తూ చేసిన ఓ ప్రసంగాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ కేటీఆర్ పై వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ రీట్వీట్ చేసిన తన ప్రసంగంలోనూ యువత ఎలా ఉండాలో పలు సూచనలు చేశారు. రాజకీయాలు, వాగ్యుద్ధాలు అన్నింటినీ పక్కనపెట్టాలని, ప్రపంచశ్రేణి, ఉత్తమ ఉత్పత్తులను అభివృద్ధి చేసే పనిలో యువత ఉండాలని తెలిపారు.