హైదరాబాద్:  కరోనాతో మూడు నెలలు  ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డాం, మళ్లీ వెసులుబాటు దొరికితే పుంజుకొంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.

గురువారం నాడు ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఆరో విడత హరిత హరం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ ముమ్మాటికీ ధనిక రాష్ట్రమేనని కేసీఆర్ పునరుద్ఘాటించారు.భవిష్యత్తులో కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు.

సమిష్టి కృషితోనే నర్సాపూర్ అటవీ ప్రాంతాన్ని మళ్లీ తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ వ్యక్తిత్వ పటిమ చాలా గొప్పదన్నారు. ఈ విషయం ఆచరణలో తేటతెల్లమైందని చెప్పారు. 

తెలంగాణలో ఎవరి దగ్గర డబ్బులు లేకపోయినా రైతుల వద్ద డబ్బులున్నట్టుగా ఆయన తెలిపారు. ఇప్పటికే రైతు బంధు పథకం కింద సహాయం బ్యాంకు అకౌంట్లలో జమ చేసినట్టుగా ఆయన చెప్పారు. 

సగం జీతాలే ఇస్తూ రైతులకు మాత్రం డబ్బులిస్తున్నారని ఉద్యోగులు తనను ప్రశ్నించారన్నారు. రైతు బంధు పథకం కింద రైతులకు సహాయం అందించేందుకు గాను మీకు డబ్బులు ఆపినట్టుగా తాను ఉద్యోగులకు చెప్పానన్నారు.ప్రజా ప్రతినిధులకు, అధికారులకు జీతాలు ఆపినా, గ్రామాలకు మాత్రం ఠంచనుగా నిధులను ఇచ్చానని ఆయన తెలిపారు.

భారతదేశంలో ప్రతి గ్రామంలో నర్సరీ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని సీఎం చెప్పారు. మనం అనుకొంటే అమెరికా కంటే గొప్పగా అభివృద్ధిలో ముందుంటామన్నారు. మన పూర్వీకుల మాదిరిగానే మనం కూడ మన భవిష్యత్తు తరాల కోసం పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. 

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అడవులు నాశనమయ్యాయన్నారు. గత పాలకులు రాష్ట్రంలోని అడవులను స్మగ్లర్లకు అప్పగించారని ఆయన  ఆరోపించారు.