న్యూయార్క్ నగర వీధుల్లో మంత్రి కేటీఆర్ తన పాత రోజులను గుర్తుచేసుకుంటున్నారు. అక్కడ సామాన్యుడిలా క్యూలో నిల్చొని చికెన్ రైస్ రుచి చూసి, అనంతరం క్యాబ్‌లో తన విధులకు హాజరయ్యారు.
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో (ktr america tour) బిజీబిజీగా గడుపుతున్నారు తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ క్రమంలో తాను గతంలో చదువుకున్న న్యూయార్క్ నగరంలో తన విద్యార్థి, ఉద్యోగ జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తన బిజీ షెడ్యూల్ మధ్యలో, ఫైజర్ సీఈఓతో సమావేశం ముగిసిన అనంతరం న్యూయార్క్ (newyork) వీధుల్లో కేటీఆర్ కాసేపు గడిపారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు లెక్సింగ్టన్, 34 అవెన్యూలో తనకు అత్యంత ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్.. వేడి వేడి సాస్ తో కూడిన చికెన్ రైస్ రుచిచూశారు. ఆ తర్వాత న్యూయార్క్‌లో ఉండే ఎల్లో క్యాబ్ ఎక్కి వెళ్లారు. ఒక రాజకీయ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, మంత్రిగా వున్న కేటీఆర్ ఒక సాధారణ వ్యక్తిలా క్యూలో నిలబడి తన ఆహారం కొనుక్కోవడం, క్యాబ్‌లో వెళ్లడం.. వంటి విషయాలను గమనించి తెలుగు ఎన్నారైలు ఆశ్చర్యపోతున్నారు. ఆయన సాధారణ జీవన శైలి, నిబద్ధతను చూసి ప్రశంసిస్తున్నారు.
అంతకుముందు హైదరాబాద్‌లోని లైఫ్ సైన్స్ సెక్టార్‌ను మరింత బలోపేతం చేయడానికి మంత్రి కేటీఆర్ అమెరికాలో మూడు దిగ్గజ ఫార్మా కంపెనీల అధినేతలతో సమావేశం అయ్యారు. ఫైజర్ సీఈవో, చైర్మన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, జాన్సన్ అండ్ జాన్సన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఈ కంపెనీకి చెందిన ప్రముఖులు, అలాగే, గ్లాక్సో స్మిత్ క్లైన్(జీఎస్కే) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌లతో మంత్రి కేటీఆర్, తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి ఎం నాగప్పలు భేటీ అయ్యారు.
ఫైజర్, జాన్సన్ అండ్ జాన్సన్, జీఎస్కే కంపెనీలు యేటా 170 బిలియన్ డాలర్ రాబడి గల దిగ్గజ కంపెనీలు. సుమారు 3.03 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ మూడు ఫార్చూన్ 500 జాబితాలో ఉన్నవే. ఫైజర్ సీఈవో, చైర్మన్ డాక్టర్ అల్బర్ట్ బౌర్లా, ఈవీపీ, చీఫ్ గ్లోబల్ సప్లై ఆఫీసర్ మైక్ మెక్ డెర్మాట్‌లతో మంత్రి కేటీఆర్ కలిశారు. తెలంగాణలోని లైఫ్ సైన్సెస్ స్థితిగతులను, వేగంగా వృద్ధి చెందుతున్న తీరును వివరించారు. అలాగే, భారత్‌లో హెల్త్ కేర్, ఫార్మాస్యూటికల్ సెక్టార్‌లో ఫైజర్ వ్యూహాలను, ప్రణాళికలను అర్థం చేసుకున్నారు.
జాన్సన్ అండ్ జాన్సన్ ఫార్మాస్యూటికల్, ఆర్ అండ్ డీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మత్తయి మామ్మెన్‌ను కలిశారు. జాన్సన్ అండ్ జాన్సన్ ప్రపంచంలోనే అగ్రశ్రేణిలో ఉండే లైఫ్ సైన్సెస్ కంపెనీ. ఈ సమావేశంలో హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్‌పై జరుగుతున్న పరిశోధనలు, అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ వివరించారు. గ్లాక్సో స్మిత్ క్లైన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిస్టర్ ఆగమ్ ఉపాద్యాయ్‌ను కలిశారు. ఆయనతో జరిగిన సమావేశంలో తెలంగాణ రాజధానిలోని టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్ సామర్థ్యాలను వెల్లడించారు.
