జూన్ 7, 8 తేదీల్లో దుబాయ్‌లో జరిగే 41వ గ్లోబల్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షోకు ముఖ్య అతిథిగా రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం అందింది. జూన్ 7, 8 తేదీల్లో దుబాయ్‌లో జరిగే 41వ గ్లోబల్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షోకు ముఖ్య అతిథిగా రావాలని నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దుబాయ్‌లోని జుమేరా టవర్స్‌ వేదిక ఈ కార్యక్రమం జరగనుంది. కేటీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఐటీ, అనుబంధ రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందని ఆయనకు పంపిన ఆహ్వానంలో నిర్వాహకులు ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడంతో దుబాయ్‌లో వున్న ప్రవాస భారతీయులకు, ముఖ్యంగా తెలుగువారికి ఎంతో స్పూర్తిగా వుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో ఆరోగ్యం, రిటైల్, తయారీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, రవాణా తదితర రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కలిగే ప్రయోజనాలను ప్రాథమికంగా చర్చించడంతో పాటు ఆయా దేశాల ప్రతినిధులు వారి అనుభవాలను వివరించనున్నారు. అలాగే ఈ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన వ్యక్తులను, సంస్థలను నిర్వాహకులు సత్కరించనున్నారు.