హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిబంధనలు పాటించని ఇంటర్ కళాశాలలపై కొరడా విధించింది ఇంటర్మీడియట్ బోర్డు. రాష్ట్ర వ్యాప్తంగా 1,338 ఇంటర్ కళాశాలల గుర్తింపును రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

కేవలం 361 కళాశాలలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది ఇంటర్ బోర్డు. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ కళాశాలలు నిబంధనలకు తిలోదకాలిస్తూ కళాశాలలను నడిపిస్తున్నారంటూ ఇంటర్ బోర్డు ఆరోపించింది. విద్యార్థుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. 

రాష్ట్రవ్యాప్తంగా 50 కళాశాలల్లో ఫైర్ సేఫ్టీ అనేది కనిపించలేదని స్పష్టం చేసింది. ఇకపోతే నిబంధనలు పాటించని కళాశాలల్లో అత్యధికం కార్పొరేట్ సంస్థలైన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలే అధికంగా ఉండటం విశేషం.

ఇకపోతే 1338 కళాశాలల గుర్తింపు రద్దు చేయడంతో సుమారు 4లక్షల మంది విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా తయారైంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మెుదలైంది. తమ విద్యార్థుల భవిష్యత్ పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు తల్లిదండ్రులు