హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ఆదివారం నాడు బోర్డు సెక్రటరీ ఆశోక్ విడుదల చేశారు.  ఈ ఫలితాలపై అనుమానాలు ఉంటే ఆన్‌లైన్‌లో సంప్రదించవచ్చని ఆయన ప్రకటించారు.

ఈ ఏడాది మార్చి మాసంలో ఇంటర్ పరీక్ష ఫలితాలను ప్రకటించారు.  ఈ ఫలితాలపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుమారు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.  దీంతో ఇంటర్  జవాబు పత్రాల రీ వ్యాలూయేషన్ చేశారు. ఆ తర్వాతే సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించారు. 

సప్లిమెంటరీ పరీక్షలకు  హాజరైన వారిలో 37.76  శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షకు మొత్తం 1,60,487 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే 60,600 మంది ఉత్తీర్ణులయ్యారు. 

బాలికల్లో 63308 మంది విద్యార్థినులు పరీక్షలు రాస్తే  26,181 మంది విద్యార్థినులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారని ఆశోక్  తెలిపారు.  బాలురలో 97,179 మంది విద్యార్థుల్లో 34,490 మంది ఉత్తీర్ణులయ్యారని ఆశోక్ తెలిపారు.