తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా పేపర్లు దిద్దడానికి వెళ్లిన లెక్చరర్లు మధ్య బస్ ఛార్జీల విషయంలో రచ్చ నడుస్తోంది. పేపర్‌ల వాల్యుయేషన్ కోసం వచ్చే వారికి ఇంటర్ బోర్డు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది.

ప్రయాణికుల నుంచి ఛార్జీలను వసూలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఇంటర్ బోర్డు. అయితే ఆ సమయంలో ఆర్టీసీ బస్సు ఆర్టీసీ ఛార్జీలు వసూలు చేయలేదు. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డుకు ఆర్టీసీ లేఖ రాసింది. దీంతో బస్ ఛార్జీలను చెల్లించాలని వాల్యుయేషనర్లను కోరింది బోర్డు.

బస్సులను బోర్డు ఏర్పాటు చేసింది కనుక ప్రయాణ ఛార్జీలు వసూలు చేయరని తాము భావించామని లెక్చరర్లు అంటున్నారు. అంతేకాకుండా ఆర్టీసీ డబుల్ ఛార్జీలు వసూలు చేసిందని, సగం మేం భరిస్తాం, మిగతా సగం మీరు కట్టాలంటూ లెక్చరర్లకు సూచిస్తోంది ఇంటర్ బోర్డు.

అయితే కష్టకాలంలో విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పేపర్ల వాల్యుయేషన్‌కు వచ్చామని, ఇప్పుడు తమ నుంచి ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమని లెక్చరర్లు మండిపడుతున్నారు.

దీంతో పేపర్ వాల్యుయేషన్ రెమ్యూనరేషన్‌ను ఇంటర్ బోర్డు నిలిపివేసింది. 30 కోట్ల రెమ్యూనరేషన్‌లో భాగంగా బస్‌లో వచ్చిన వారితో పాటు రాని వారివి కూడా బోర్డు ఆపేసింది. వెంటనే తమకు రావాల్సిన రెమ్యూనరేషణ్ మంజూరు చేయాలని ఇంటర్ విద్య జేఏసీ డిమాండ్ చేస్తోంది.

గత ఐదు నెలలుగా జీతాలు లేక ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్లు అల్లాడుతున్నారని ఇంటర్ జేఏసీ చెబుతోంది. కాగా మే 12 నుంచి ప్రారంభమైన ఇంటర్ స్పాట్ వాల్యుయేషన్ మే 30తో ముగిసింది. దీనిలో 15 వేల వరకు లెక్చరర్లు పాల్గొన్నారు. హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లోనూ ఆర్టీసీ బస్సుల ద్వారా అధ్యాపకులను ఉమ్మడి జిల్లా కేంద్రాలకు తరలించారు.