ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ లేకున్నా చేర్చుకోండి: ఆసుపత్రులకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
తెలంగాణలో కరోనా నివారణా చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు , వైరస్ కట్టడి, ఆక్సిజన్ కొరత విషయంలో ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో వుండేలా చూసుకోవాలని సూచించింది
తెలంగాణలో కరోనా నివారణా చర్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు , వైరస్ కట్టడి, ఆక్సిజన్ కొరత విషయంలో ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ అందుబాటులో వుండేలా చూసుకోవాలని సూచించింది.
కోవిడ్ లక్షణాల ఆధారంగా బాధితులను ఆసుపత్రుల్లో అడ్మిట్ చేసుకోవాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఆర్టీపీసీఆర్ టెస్టులు రోజుకు 30 నుంచి 40 వేలు చేస్తున్నామని ప్రభుత్వం చెప్పగా.. కోర్టు తప్పుబట్టింది.
ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు 8.40 లక్షల టెస్టులు చేయాల్సి వుండగా 3.47 వేల టెస్టులు మాత్రమే చేసినట్లు చెప్పింది. కోవిడ్ నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు, పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
Also Read:నైట్ కర్ఫ్యూతో కేసులు ఎక్కడ తగ్గాయి:తెలంగాణ సర్కార్‌కి హైకోర్టు ప్రశ్నల వర్షం
తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లేకున్నా ఆసుపత్రుల్లో చేర్చుకోవాలని సూచించింది. కరోనా కేసులు ఎక్కువ వున్న జిల్లాల్లో టెస్టుల సంఖ్య పెంచాలని హైకోర్టు సూచించింది.
కోవిడ్ నియంత్రణ సూచనలు చేసేందుకు ప్రత్యక కమిటీ వేయాలని.. పగటి పూట జనాలు గుమిగూడకుండా చూడాలని ఆదేశించింది. ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు విధించాలని ధర్మాసనం సూచించింది.
వైన్స్, బార్లు, రెస్టారెంట్లు, థియేటర్ల వద్ద పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారిని క్షుణ్ణంగా పరిశీలించాలని.. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, జాతీయ రహదారులపై పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించింది.
కుంభమేళా నుంచి తిరిగి వచ్చిన వారి వివరాలు నమోదు చేయాలని.. వారిని క్వారంటైన్‌లో వుంచాలని న్యాయస్థానం కోరింది. కరోనా వివరాలను ప్రతిరోజూ మీడియా బులెటిన్‌లో విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. యాదాద్రి, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్‌లో పెద్ద ఎత్తున కేసులు వస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.