హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు హై కోర్టు ఆదేశించింది. పురపాలక ఎన్నికలను ఐదు నెలల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు మంగళవారం ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు తక్షణమే ఏర్పాట్లు ప్రారంభించాలని అటు ప్రభుత్వాన్ని ఇటు ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. 

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలకు సంబంధించి ప్రక్రియ చేపట్టడం లేదని ఆరోపిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును ఆశ్రయించింది.  

రాష్ట్ర ఎన్నికల సంఘంతోపాటు మరో ఇద్దరు పురపాలక ఎన్నికలపై హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ మూడు పిటీషన్లపై గత కొంతకాలంగా ఉన్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది. తమకు 5నెలల గడువు కావాలని హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కోరింది. 

మూడు పిటీషన్లపై మంగళవారం మరోసారి విచారణ చేపట్టిన హైకోర్టు ఇవాళ్టి నుంచి 119రోజుల్లోనే వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ వంటి ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియంతా పూర్తి చేశాక నెల రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సూచనలు చేసింది. అనంతరం తదుపరి విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది హై కోర్టు.