తెలంగాణ ప్రభుత్వానికి జిల్లాలను ఏర్పాటు చేసే అధికారం వుందని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. 

జిల్లాలను పెంచే విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (telangana new districts) తన అధికారాల పరిధిలోనే వ్యవహరించినట్టు రాష్ట్ర హైకోర్టు (telangana high court) తేల్చిచెప్పింది. ఇందుకు సంబంధించి దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఈ పిటిషన్‌ను రంగు బాలలక్ష్మి, వరంగల్‌కు చెందిన మరో నలుగురు కలసి దాఖలు చేశారు. ప్రభుత్వం జిల్లాలను అశాస్త్రీయ విధానంలో, ఏకపక్షంగా విభజించిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి అధికారులు అనుసరించిన విధానం తెలంగాణ డిస్ట్రిక్స్ యాక్ట్ 1974, తెలంగాణ డిస్ట్రిక్స్ రూల్స్ 2016 నిబంధనలకు విరుద్ధంగా ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

ఈ వాదనలను విన్న చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం జిల్లాల ఏర్పాటు అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి (telangana govt) ఉందని తేల్చి చెప్పింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు వెనుక చెడు ఉద్దేశ్యాలున్నట్టు పిటిషనర్లు నిరూపించలేకపోయారని హైకోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో తప్పుడు ఉద్దేశ్యాలు లేనప్పుడు న్యాయ సమీక్ష కుదరదని ధర్మాసనం వెల్లడించింది. 

కాగా.. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం 2016, ఆగస్టు 10న ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి అయిన మహమూద్ అలీ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటయ్యింది. దీని ప్రకారం పాత 10 జిల్లాలకు అదనంగా 17 జిల్లాలను సూచిస్తూ ముసాయిదాను ప్రకటించారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అదనంగా కావాల్సిన జిల్లాల ఏర్పాటుపై రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు ఆధ్వర్యంలో హైపర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, జీ జగదీశ్వర్‌రెడ్డి సభ్యులుగా వ్యవహరించారు. ఈ మేరకు కొత్తగా ఏర్పడిన 21 జిల్లాలు 2016, అక్టోబర్ 11 (దసరా)న అధికారికంగా ప్రారంభమయ్యాయి.